46 రోజులుగా దీక్ష చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవటంతో... తమ సమస్యను కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకునేందుకు రాజధాని రైతులు సిద్ధమయ్యారు. అమరావతి పరిరక్షణ నేతలు, రైతులతో కలసి గన్నవరం విమానాశ్రయం నుంచి దిల్లీకి చేరుకున్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసి... మూడు రాజధానుల నిర్ణయం, అమరావతి రైతుల పోరాటం వివరిస్తామని చెప్పారు. సోమవారం ఉదయం ఉపరాష్ట్రపతి వెంకయ్యతో రైతులు భేటీ కానున్నారు.
ఉద్యమంలో దాదాపు 30 మంది రైతులు మరణించారని, వారికి కేంద్రం కూడా సంతాపం తెలపలేదని ఐకాస నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధికి భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలని కోరుతామని చెప్పారు. ఏ కమిటీ వల్ల తమకు న్యాయం జరగదని అభిప్రాయపడ్డారు. తమ నినాదం ఒక రాష్ట్రం-ఒక రాజధాని అని చెప్పారు. వైకాపా ఎంపీ కృష్ణదేవరాయలు మొక్కుబడిగా దీక్షా శిబిరాలకు వచ్చారని.... రాజధానికి మద్దతుగా ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం బాధాకరమని రైతులు అన్నారు.
ఇవాళ చర్చా కార్యక్రమం
అమరావతి పరిరక్షణ సమితి ఐకాస ఆధ్వర్యంలో 47వ రోజు రాజధాని అమరావతిపై ఇవాళ చర్చా కార్యక్రమం జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర గంటల వరకూ ఈ కార్యక్రమం జరగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా రైతు సంఘాల నాయకులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. భూములు ఇచ్చిన రైతుల సమస్యలను ప్రస్తావించనున్నారు.
జనసేన, భాజపా నేతలు సంయుక్తంగా పర్యటన
చర్చా కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే రాజధాని గ్రామాల్లో జనసేన, భాజపా నేతలు సంయుక్తంగా పర్యటిస్తారు. మందడం, వెలగపూడి, తుళ్లూరులో పర్యటించి... రాజధానికి భూములిచ్చిన రైతులతో మాట్లాడుతారు. వారికి భరోసా కల్పించటమే తమ లక్ష్యమని ఇరుపార్టీల నేతలు వెల్లడించారు.
ఇదీ చదవండి: అదిత్య పారాయణం చేస్తూ... అమరావతి దీక్ష