పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రాజధాని రైతులు 274వ రోజూ ఆందోళనలు కొనసాగించారు. తుళ్లూరు, రాయపూడి, బోరుపాలెం, దొండపాడు, మందడం, వెలగపూడి, ఉద్ధండరాయునిపాలెం, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, పెనుమాకలో దీక్షా శిబిరాల్లో రైతులు ఆందోళన చేశారు. ఉద్ధండరాయుని పాలెంలో రైతులు, మహిళలు పళ్లెం, గరిటెలతో నిరసన తెలిపారు. పళ్లాలు మోగించి అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు. అమరావతి నిర్మాణానికి ప్రధాని ఇదే గ్రామంలో శంకుస్థాపన చేశారని...ఇప్పుడు ఆ గ్రామంలో ఉన్న రైతుల పరిస్థితి ఒక్కసారి వచ్చి చూడాలని డిమాండ్ చేశారు.
మందడంలో.. రైతులు అమరావతినే పరిపాలన రాజధానిగా కొనసాగించాలని కోరుతూ గణపతి హోమం చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి తిరోగమనంలో నడుస్తుందని రైతులు వెనక్కి నడిచి నిరసన తెలిపారు. రాష్ట్రాన్ని అప్పులమయం చేశారంటూ రైతులు ఆక్షేపించారు. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టడాన్ని ఎర్రబాలెం, వెలగపూడి రైతులు ఖండించారు. జగన్పై ఉన్న కేసులన్నీ త్వరితగతిన విచారణ జరిగేలా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని రైతులు కోరారు.
ఇదీ చదవండి : 'సింహం ప్రతిమలు అదృశ్యమైతే ఈవో కప్పిపుచ్చుతున్నారు'