మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు, రైతు కూలీలు, మహిళలు చేస్తున్న నిరసనలు ఆదివారం 362వ రోజు కొనసాగాయి. తుళ్లూరులో రైతులు, మహిళలు భారీ ర్యాలీగా వీధుల్లో తిరుగుతూ ఇంటింటికీ అమరావతి కార్యక్రమాన్ని నిర్వహించారు. వారి వెంట ఉద్యమ గాయకుడు రమణ బృందం గీతాలు ఆలపించి ఆకట్టుకున్నారు. ప్రతి కుటుంబం ఉద్యమంలో పాల్గొనాల్సిన ఆవశ్యకతను వివరించారు. వెంకటపాలెంలో రైతులు, మహిళలు రోడ్డు మీద మోకాళ్లపై నిల్చొని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగాలని దొండపాడులో కనకదుర్గమ్మ అమ్మవారికి పూజలు చేశారు.
భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో సోమవారం తుళ్లూరులో కిసాన్ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు హాజరు కానున్నట్లు రాజధాని పరిరక్షణ ఐకాస నేతలు తెలిపారు. అమరావతి ఉద్యమం మొదలుపెట్టి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ సామాజిక మాధ్యమాల ద్వారా ఉద్యమం గురించి ప్రజలకు వివరించాలని ఐకాస నేతలు కోరారు. హైదరాబాద్‌లో ఉన్న అమరావతి మద్దతుదారులందరూ ఈ నెల 17న ఉద్దండరాయునిపాలెంలో జరిగే సభలో పెద్దఎత్తున పాల్గొనాలన్నారు.
ఇదీ చదవండి: నేడు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం జగన్