రాష్ట్రంలో సూక్ష్మసేద్యం ముందుకు సాగడం లేదు. ఈ విధానం అమల్లో రాష్ట్రానికి గతంలో ఘనచరిత్రే ఉన్నా.. ఈసారి పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. అందుబాటులో ఉన్న వెయ్యీ 28 కోట్లలో ఒక్క రూపాయి వినియోగించలేదు. ఫలితంగా 3 లక్షల 5 వేల రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం పేపర్‌కే పరిమితమైంది. సూక్ష్మసేద్యం అమల్లో ఏపీ 2015-16 నుంచి ప్రగతి సాధిస్తూ వస్తోంది. 2018-19లో అప్పటి ప్రభుత్వం ఏకంగా 5 లక్షల ఎకరాలకు బిందు, తుంపర పరికరాలు అమర్చడం ద్వారా రాష్ట్రాన్ని దేశంలో రెండోస్థానంలో నిలిపింది.
గతేడాది రాష్ట్రం వెనుకబడింది. 3 లక్షల 5 వేల ఎకరాలకే పరిమితమైంది. ఈ ఏడాది నడకే నిలిపేసింది. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన కింద కేటాయించిన 412 కోట్లు సహా.. సూక్ష్మసేద్యనిధి కింద నాబార్డు ద్వారా వచ్చిన 616 కోట్లను వినియోగించలేదు. ఫలితంగా గతంలో ఆంధ్రప్రదేశ్‌కు ఆమడ దూరంలో నిలిచిన రాష్ట్రాలు ఇప్పుడు ముందుకు దూసుకెళ్తున్నాయి. వాస్తవానికి ప్రధానమంత్రి కృషి సించాయి యోజన పథకం కింద సూక్ష్మసేద్య పథకానికి గతంతో పోలిస్తే ప్రస్తుతం కేటాయింపులు నీరసించాయి.
ఈ పథకం కింద రాష్ట్రంలో 2018-19లో వెయ్యీ 47 కోట్లు ఖర్చు చేశారు. 2019-20 బడ్జెట్‌లో 11 వందల 5 కోట్లు కేటాయించినా.. సవరణల తర్వాత కేటాయించిన 432 కోట్లు ఖర్చు చేశారు. ఈసారి కేటాయింపులను 412 కోట్లకే కుదించారు. ఇందులో ప్రభుత్వం 333 కోట్ల 33 లక్షలకు పాలనా అనుమతులు ఇచ్చినప్పటికీ... నిధులను పీడీ ఖాతాకు జమచేయలేదు. నాబార్డు ద్వారా రూ.616 కోట్లు రుణంగా వచ్చినా... సూక్ష్మసేద్యం ప్రాజెక్టులో పురోగతి లేదు.
ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రాజెక్టు మంజూరైన రైతులకు ఇప్పటికీ పరికరాలు అందలేదు. ఏప్రిల్ నుంచి ఇప్పటివరకూ... 57 వేల ఎకరాలకు సంబంధించి 17 వేలమంది రైతులు నమోదు చేసుకున్నారు. ఇందులో ఒక్క అనంతపురం జిల్లా నుంచే 4 వేల 200 మంది ఉన్నారు. ఇప్పటికే ఖరీఫ్ ముగిసి రబీ మొదలైన నేపథ్యంలో వేసవిని దృష్టిలో పెట్టుకుని ఇకనైనా ప్రాజెక్టును పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు.
ఇదీ చదవండీ... వంశీ అద్దె నేత.. అసలైన వైకాపా నాయకుడిని నేనే: వెంకట్రావు