కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్‌ఐ) మందుల కొనుగోళ్లపై మరో వివాదం తెరపైకి వచ్చింది. గతేడాది ఏప్రిల్‌లో మందుల కొనుగోళ్లలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలొస్తున్నాయి. దీనిపై విచారణకు ఈఎస్‌ఐ డైరెక్టరు రాజేంద్రకుమార్ నలుగురు సభ్యులతో కమిటీని వేశారు. సాధారణంగా ఈఎస్‌ఐ మందులను రేట్ కాంట్రాక్టు (ఆర్‌సీ) ఉన్న కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంస్థల నుంచే కొనుగోలు చేయాలి. ఆ సంస్థలు సరఫరాకు నిరాకరిస్తే.. ఏపీఎంఎస్‌ఐడీసీ నుంచి కొనొచ్చని ప్రభుత్వం చెప్పింది.
అదీ కుదరని పక్షంలో టెండరు ప్రక్రియ నిర్వహించి కొనొచ్చు. ఇవేమీ కాకుండా.. అధికారులు గతేడాది విజయవాడకు చెందిన విజయకృష్ణా సూపర్ బజార్ (కో ఆపరేటివ్ సొసైటీ) నుంచి మందులు, మాస్కులు కొన్నారు. ఈ విషయంలో ఈఎస్‌ఐ డైరెక్టరేట్‌లో పని చేసిన ఓ జాయింట్ డైరెక్టరుకు, మరో ఉద్యోగికి సంబంధముండొచ్చని అనుమానిస్తున్నారు. విజయకృష్ణా సూపర్ బజార్‌కు మందులు సరఫరా చేసే లైసెన్సు లేని సమయంలో ఈ మందులు కొన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడైనా మందులు కొనొచ్చని ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసినందునే తాము రూ.70 లక్షల విలువ చేసే మందులు, మాస్కులు సూపర్ బజార్ నుంచి కొన్నట్లు బాధ్యులు చెబుతున్నారు. ‘కొవిడ్ సమయంలో జరిగిన ఈ కొనుగోళ్ల విషయం మా దృష్టికి వచ్చింది. దస్త్రాలన్నీ చూడాలి. అవకతవకలు నిజమైతే చర్యలు తీసుకుంటాం’ అని కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం చెప్పారు.
ఇదీ చదవండి:
Quality Education: నాణ్యమైన విద్యలో.. జాతీయ స్థాయిలో ఏపీకి 19వ స్థానం