రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఆస్తి, చెత్త, నీటి పన్ను, యూజర్ ఛార్జీలకు వ్యతిరేకంగా ఈనెల 15న అన్ని పుర, నగరపాలక సంస్థల పరిధిలోని వార్డు సచివాలయాల ఎదుట నిరసనలు చేపట్టాలని అఖిలపక్ష సమావేశంలో తీర్మానించినట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. పుర, నగరపాలక సంస్థల్లో ఈనెల 16న ఏపీ పట్టణ పౌరసమాఖ్య తలపెట్టిన ఆందోళనలకు సంఘీభావం తెలపాలని నిర్ణయించామన్నారు.
పట్టణాల్లో పన్నులు పెంచుతూ ప్రభుత్వమిచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ విజయవాడలోని దాసరిభవన్‌లో సీపీఐ ఆధ్వర్యంలో శనివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. దీనికి సీపీఐ, సీపీఎం, తెదేపా, కాంగ్రెస్, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, ఎంసీపీఐ, ఆమ్‌ఆద్మీ, అమరావతి ఐకాస, లారీ ఓనర్స్ అసోసియేషన్, ప్రజాసంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. సమావేశానికి అధ్యక్షత వహించి రామకృష్ణ మాట్లాడారు. లాక్‌డౌన్ తర్వాత భారీ జనసమీకరణతో ప్రత్యక్ష ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. పెంచిన పన్నులకు వ్యతిరేకంగా కలిసికట్టుగా ఉద్యమించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పిలుపునిచ్చారు.పన్నుల పెంపునకు వ్యతిరేకంగా అఖిలపక్ష సమావేశం చేపట్టబోయే అన్ని ఆందోళనలకు తెదేపా సంపూర్ణ మద్దతునిస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే ప్రజలపై రూపాయి పన్ను వేయబోనంటూ సీఎం జగన్ హామీనిచ్చి అందుకు భిన్నంగా వడ్డిస్తున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్‌వలీ పేర్కొన్నారు. ఏపీ పట్టణ పౌర సమాఖ్య కన్వీనర్ బాబూరావు, ఆమ్‌ఆద్మీ పార్టీ రాష్ట్ర నాయకుడు పోతిన వెంకటరామారావు, ఎంసీపీఐ నేత ఖాదర్‌బాషా, న్యూడెమోక్రసీ నాయకుడు కుటుంబరావు, అమరావతి ఐకాస నాయకుడు శివారెడ్డి, లారీ యజమానుల సంఘం కృష్ణా జిల్లా అధ్యక్షుడు లక్ష్మణస్వామి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: