2017 మార్చి 23.....విజయవాడలోని దాసరి భవన్..న్యాయంచేయాలంటూ అగ్రిగోల్డ్ బాధితులు.. నిరవధిక నిరాహార దీక్షలు చేశారు.
2021 జులై 24... అదే విజయవాడలోని దాసరి భవన్.! అదే న్యాయం కోసం మళ్లీ నిరవధిక దీక్షల్లో ఉన్నారు.
ఈ 2దృశ్యాలు చిత్రీకరించిన సమయాలు వేరైనా.. కొన్ని సారూప్యతలున్నాయి. అప్పటి శిబిరంలో జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ వంటి పెద్దలున్నారు. ఇప్పటి శిబిరంలో బాధితులు, ఉద్యమకారులు మాత్రమే మిగిలారు. అంటే.. అగ్రిగోల్డ్ బాధితుల ఆక్రందనే ఇంకా అదే దీక్షాశిబిరంలో ధ్వనిస్తుంటే..జగన్ ప్రతిపక్ష నేత హోదా నుంచి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 2017 నుంచి 2021 వరకూ ఏం జరిగిందనేది పరిశీలిస్తే.
రెండేళ్లైనా నిరాశే..
ఇదీ ప్రతిపక్ష నేత హోదాలో అగ్రిగోల్డ్ శిబిరానికి వచ్చి జగన్ ఇచ్చిన మాట. మాటివ్వడమేకాదు..మన ప్రభుత్వం రాబోతోంది ఇక పోరాటం అవసరం లేదంటూ
నిమ్మరసం కూడా.. ఇచ్చి అప్పట్లో దీక్షలు విరమింపజేశారు జగన్. అన్నట్లే అధికారంలోకి వచ్చారు. ఇక... తమ డబ్బు వచ్చేస్తాయని ఆశపడిన బాధితులు రెండేళ్లైనా రాకపోయేసరికి నిరాశపడ్డారు. మళ్లీ అదే దాసరిభవన్ వేదికగా... దీక్షలు చేపట్టారు. వారంలో పువ్వుల్లో పెట్టి డబ్బులిస్తామని నాడు చెప్పిన జగన్.....నేడు తమ చెవుల్లో పూలుపెట్టారంటున్నారు ఉద్యమకారులు....! ఈనెల 31న సీఎంను కలవాలనుకుంటున్నారు.
నిజానికి రూ.20 వేల లోపు డిపాజిట్‌దారులకు చెల్లింపుల కోసం... 2019-20 తొలి బడ్జెట్‌లో వైకాపా ప్రభుత్వం 1,150 కోట్ల రూపాయలు కేటాయించింది. మొదటి దశలో రూ.10 వేల లోపు డిపాజిటర్లకు చెల్లించేందుకు 263.99 కోట్లు.. విడుదల చేసింది. 2020-21 బడ్జెట్‌లో 200 కోట్లు కేటాయించారేగానీ పైసా విడుదల చేయలేదు. 2021-22 బడ్జెట్‌లో... మళ్లీ రూ.200 కోట్లు ప్రతిపాదించారు. ఆగస్టులో చెల్లింపులు చేస్తామంటూ ఫిబ్రవరిలో విడుదల చేసిన సంక్షేమ క్యాలెండర్‌లో...పేర్కొన్నారు.
ఆ విషయాన్ని గుర్తుచేసేందుకే నిరవధిక దీక్షలు చేస్తున్నామంటున్నారు బాధితులు.
దీక్షా శిబిరంలోవివిధ జిల్లాల నుంచి వచ్చిన బాధితులున్నారు. ప్రతిపక్షంలోఉండగా నేను ఉన్నాను విన్నాను అని చెప్పిన జగన్.. ఇప్పుడు పక్కనే తాడేపల్లిలో ఉండి కూడా తమ గోడు ఎందుకు వినలేకపోతున్నారన్నదే బాధితుల ప్రశ్న..
300 మంది చనిపోయారు..
ఇప్పటికే 300మందికిపైగా.... అగ్రిగోల్ బాధితులు ప్రాణాలు కోల్పాయారని చెప్తున్నారు బాధితులు. నాటి నుంచి నేటి వరకూ.... కాలం గడిచిందేగానీ కన్నీరు ఆగడంలేదంటూ.. ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు.
రూ.20 వేలలోపు డిపాజిట్ చేసిన ఖాతాదారుల్లో..9 లక్షల 64 వేల మంది మంది ఉన్నారు. వీరికి రూ.916 కోట్ల వరకూ ఇవ్వాలి. రూ.20 వేల కంటే ఎక్కువ కట్టిన వారినీ పరిగణనలోకి తీసుకుంటే మరో 6 లక్షల క్లెయిములు పరిష్కరించాల్సి ఉంది. వారందరికీ చెల్లించాలంటే.. ఇంకో 3వేల710 కోట్లు అవసరం. ఈ మొత్తం ఎన్నివారాలకు పంపిణీ చేస్తారో.. ముఖ్యమంత్రే స్పష్టత ఇవ్వాలంటున్నారు బాధితులు.
హమీలు నెరవేర్చాలి..
తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చేదెన్నడంటూ అగ్రిగోల్డ్ బాధితులు మరోసారి నిరవధిక ఆందోళనలు చేపట్టారు. తమ వేదన తీర్చాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఆగస్టు నాటికి తమ ఇబ్బందులు తీరుస్తామంటూ సంక్షేమ క్యాలెండర్‌లో ముఖ్యమంత్రి చేసిన ప్రకటన ఆచరణలో చూపాలని వేడుకుంటున్నారు. పదో రత్నంగా అగ్రిగోల్డ్ బాధితుల ఇబ్బందులను పరిగణిస్తామంటూ వాగ్ధానం చేసినా ఇంతవరకు తమ వెతలు తీర్చడం లేదని కన్నీళ్లపర్యంతం అవుతున్నారు. ఈనెల 28 నాటికి ఓ విధాన నిర్ణయాన్ని ప్రకటించాలని... లేదంటూ ఈనెల 31న ముఖ్యమంత్రి కార్యాలయానికి విజ్ఞాపనయాత్ర నిర్వహిస్తామని స్పష్టం చేస్తున్నారు.
ఇదీ చదవండి: snake: ఫ్రిజ్లో పాము.. పరుగులు తీసిన కుటుంబ సభ్యులు