తెలంగాణలో కృష్ణా నదికి అత్యధికంగా 20 వేల చదరపు మైళ్ల పరివాహక ప్రాంతం ఉందని.. ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 9 వేల చదరపు మైళ్ల పరివాహక ప్రాంతం ఉందని చెప్పారు. తెలంగాణలోనే అత్యధిక ప్రాజెక్టులు, నీటి వినియోగం జరగాలని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 811 టీఎంసీలు కేటాయించారని.. అందులో రాష్ట్రానికి 500 టీఎంసీలు రావాలని పేర్కొన్నారు. గతంలో ఏపీ ప్రాజెక్టులకే అధికంగా నీటి కేటాయింపులు చేశారని మంత్రి ఆరోపించారు.
జీవో ఇచ్చినపుడే వ్యతిరేకించాం
కొత్త ప్రాజెక్టులపై ఏ రాష్ట్రమైనా అన్ని రకాల అనుమతులు పొందాలని మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. అనుమతులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతలు ఎలా చేపడతారని ప్రశ్నించారు. రాయలసీమ ఎత్తిపోతలపై జీవో ఇచ్చినపుడే వ్యతిరేకించామని చెప్పారు. కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిపారు. కృష్ణా బేసిన్‌లోని అవసరాలు తీర్చకుండా మరో బేసిన్‌కు తరలించకూడదన్నారు. నీటి పారుదల నిపుణులు చెప్పినా ఏపీ పట్టించుకోవట్లేదని మంత్రి విమర్శించారు.
ఎట్లా తప్పవుతుంది?
'శ్రీశైలం ప్రాజెక్టు ప్రాథమికంగా విద్యుత్ ఉత్పత్తి కోసం నిర్మించారు. 1984 నుంచి కృష్ణా నీటిని అక్రమంగా తరలిస్తున్నారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి వాటాల పంపిణీ శాశ్వతంగా జరగాలి. కాళేశ్వరం ప్రాజెక్టును.. పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ను ఒప్పించి న్యాయబద్ధంగా నిర్మించాం. తెలంగాణ ఉద్యమం జరిగింది నీటి కోసమే. మా హక్కను వినియోగించుకుంటే ఎట్లా తప్పవుతుంది. ఏ సమస్య అయినా సామరస్యంగా పరిష్కరించుకోవాలి. కేంద్రం పట్టనట్లు ఉంది. ఇది చాలా బాధకరం. కేంద్రమే రెండు రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించాలి.'
-నిరంజన్ రెడ్డి, తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి
AP-TS-WATER ISSUE: ప్రాజెక్ట్‌ల వద్ద కొనసాగుతున్న పోలీసుల పహారా