రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా 1987 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్‌దాస్ నియమితులయ్యారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి నీలంసాహ్ని ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు. అదేరోజు కొత్త ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్‌దాస్ బాధ్యతలు చేపడతారు. పదవీ విరమణ తర్వాతా నీలంసాహ్ని సేవల్ని వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆమెను కేబినెట్ మంత్రి హోదాలో, ముఖ్యమంత్రికి ముఖ్య సలహాదారుగా నియమించింది.
మరికొందరు ఐఏఎస్ అధికారుల్నీ ప్రభుత్వం బదిలీ చేసింది. తెలంగాణ నుంచి ఇటీవలే ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు వచ్చిన వై.శ్రీలక్ష్మిని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా నియమించింది. ప్రస్తుతం ఆ శాఖ కార్యదర్శిగా ఉన్న జె.శ్యామలరావు జలవనరుల శాఖలో ప్రత్యేకాధికారిగా (ఓఎస్‌డీ) వెళ్లనున్నారు. ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆదిత్యనాథ్‌దాస్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాక, జలవనరుల శాఖ కార్యదర్శిగా శ్యామలరావు బాధ్యతలు స్వీకరిస్తారు. ఆర్థికశాఖ కార్యదర్శిగా ఉన్న కె.సునీతను సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం సాంఘిక సంక్షేమ శాఖను బుడితి రాజశేఖర్ పూర్తి అదనపు బాధ్యతతో నిర్వహిస్తున్నారు. రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల సహకార ఆర్థిక సంస్థ వైస్‌ఛైర్మన్, ఎండీ పోస్టునూ పూర్తి అదనపు బాధ్యతగా సునీతకు అప్పగిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
![](https://assets.eenadu.net/article_img/main3a_7.jpg)
నీలంసాహ్నికి ఆరోగ్యం, జిల్లాల విభజన బాధ్యతలు
ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు హోదాలో నీలంసాహ్ని... ఆరోగ్యం, కొవిడ్ నియంత్రణ, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, విభజన అంశాలు, పరిపాలన సంస్కరణలు, వార్డు, గ్రామ సచివాలయాలతో పాటు, జిల్లాల్లో వివిధ స్థాయుల్లో ఇతర ప్రభుత్వ సంస్థల బలోపేతం, జిల్లాల విభజన, భూసర్వే, టైట్లింగ్ చట్టం వంటి అంశాల్ని పర్యవేక్షిస్తారని ప్రభుత్వం పేర్కొంది. వాటితో పాటు ముఖ్యమంత్రి సమయానుగుణంగా కేటాయించే ఇతర అంశాలు, ప్రాజెక్టుల్ని ఆమె పర్యవేక్షిస్తారని తెలిపింది.
ఆదిత్యనాథ్‌దాస్ సర్వీసు మరో ఆరు నెలలు?
కొత్త సీఎస్‌గా నియమితులైన ఆదిత్యనాథ్‌దాస్ సొంత రాష్ట్రం బిహార్. 1961 జూన్ 30న జన్మించారు. ఆయన 2021 జూన్ నెలాఖరున పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తే... ఆయన సర్వీసును కేంద్ర ప్రభుత్వం గరిష్ఠంగా మరో ఆరు నెలలు పొడిగించే అవకాశం ఉంది. ఐఏఎస్ అధికారిగా ఆదిత్యనాథ్‌దాస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, విభజన తర్వాతా పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. నీటిపారుదల శాఖ బాధ్యతల్ని ఎక్కువ కాలం చూశారు. ఆదిత్యనాథ్ దాస్ ఐఏఎస్ శిక్షణ పూర్తి చేసుకున్నాక... మొదట విజయనగరం జిల్లా అసిస్టెంట్ కలెక్టర్‌గా నియమితులయ్యారు. ఆ తర్వాత ఆయన నంద్యాల, విజయవాడల్లో అసిస్టెంట్ కలెక్టర్‌గా, నెల్లూరు డీఆర్‌డీఏ పీడీగా, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్‌గా, కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్‌గా, కేంద్ర ప్రభుత్వంలో డిప్యూటీ డైరెక్టర్ హోదాలో, వరంగల్ కలెక్టర్‌గా, ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శిగా, దిల్లీలో ఏపీ భవన్ అదనపు కమిషనర్‌గా, పురపాలక శాఖ కమిషనర్, డైరెక్టర్‌గా పనిచేశారు.
పదిన్నరేళ్లకుపైగా ఒకే శాఖ
ఆదిత్యనాథ్‌దాస్ తన కెరీర్‌లో సుమారు పదిన్నర సంవత్సరాలకుపైగా నీటిపారుదల శాఖ బాధ్యతల్ని పర్యవేక్షించారు. ఇప్పుడూ ఆయన జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగానే ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోగానీ, రాష్ట్ర విభజన తర్వాతగానీ ఇంత సుదీర్ఘకాలం ఒక శాఖ బాధ్యతల్ని పర్యవేక్షించిన అధికారి మరొకరు లేరు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2007 ఏప్రిల్ 23న నీటిపారుదల శాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 2012 ఫిబ్రవరి 27 వరకు ఈ పదవిలో ఉన్నారు. పదోన్నతి లభించడంతో... అదే శాఖకు 2012 ఫిబ్రవరి 28 నుంచి 2016 మే 31 వరకు జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత కొన్నాళ్లు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శిగా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. మళ్లీ 2019 జూన్ 5న జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమితులై, ప్రస్తుతం అదే పోస్టులో కొనసాగుతున్నారు.
త్వరలో మరిన్ని బదిలీలు
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారులను బదిలీ చేయనున్నట్టు సమాచారం. జిల్లాల కలెక్టర్లు, విభాగాధిపతులు, కార్యదర్శుల బదిలీలు ఉంటాయని తెలిసింది. అవి కొత్త ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్‌దాస్ బాధ్యతలు చేపట్టాక ఉంటాయా? అంతకు ముందేనా? అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు.
ప్రభుత్వ వాగ్దానాలను నెరవేర్చడమే లక్ష్యం
-
‘ఈనాడు- ఈటీవీ భారత్’తో ఆదిత్యనాథ్‌దాస్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాధాన్యాలు, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరేలా చూడటమే తన లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఆదిత్యనాథ్‌దాస్ చెప్పారు. ఈ అవకాశాన్ని కల్పించిన ముఖ్యమంత్రి జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకూ తన కృతజ్ఞతలని, వారి జీవన ప్రమాణాలు మెరుగుపడేలా.. ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతమయ్యేలా చూస్తానని చెప్పారు. ఈ మేరకు మంగళవారం రాత్రి ‘ఈనాడు’తో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. తన సహచర అధికారులు, ఉద్యోగులతో కలసి సమష్టి కృషి ద్వారా లక్ష్యాలు సాధిస్తామని వివరించారు.
ఇదీ చదవండి: కొవిడ్ సెకండ్ వేవ్ పట్ల జాగ్రత్తగా ఉండాలి: సీఎం జగన్