మూడు రాజధానులనే జూదాలాటతో ప్రజలను మోసం చేసేందుకు వైకాపా నేతలు ఆరాటపడుతున్నారని తెదేపా శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు విమర్శించారు. వైకాపా ప్రభుత్వం జూదాన్ని రాష్ట్ర క్రీడగా మార్చిందని విమర్శించారు. గత తెదేపా పాలనలో అభివృద్ధికి చిరునామాగా ఉన్న రాష్ట్రాన్ని.. నేడు అవినీతి, అక్రమాలు, జూదాలకు నిలయంగా మార్చారని మండిపడ్డారు. 3 రాజధానుల పేరుతో 3 ప్రాంతాల ప్రజల ఆత్మాభిమానంతో సీఎం జగన్ చెలాగాటం ఆడుతున్నారని అచ్చెన్నాయుడు బహిరంగ లేఖ రాశారు. రాజధాని కోసం శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలుపుతున్న రైతులపై ప్రభుత్వం దాడులు చేయిస్తోందన్నారు. చట్ట వ్యతిరేకమైన కోడిపందాలు, గుండాట, పేకాటలను ప్రోత్సహించటం సిగ్గుచేటని మండిపడ్డారు.
ప్రజా సమస్యలు పట్టని ముఖ్యమంత్రి
వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలే కోడిపందాలు, గుండాటలను ప్రోత్సహిస్తున్నారని అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని క్లబ్‌లను రద్దు చేశామని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన ముఖ్యమంత్రి.. పులివెందుల నుంచి ఇచ్ఛాపురం వరకు వైకాపా నేతల ఆధ్వర్యంలోనే జరుగుతున్న జూదాలపై ఏం సమాధానమిస్తారని ప్రశ్నించారు. అందరికీ అన్నం పెట్టే రైతన్నను పండుగ నాడు పస్తులుంచి, సీఎం జగన్ మాత్రం సంక్రాంతి సంబరాలు చేసుకోవటం విడ్డూరంగా ఉందన్నారు.
ఇదీ చదవండి: