తెలంగాణలోని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బాలిక అపహరణ(girl kidnap case), లైంగిక దాడి(Sexual harassment) కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. పశ్చిమ బంగకు చెందిన ఇందు అనే యువకుడు.. చిన్నారిని అపహరించాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. సీసీ కెమెరా(CCTV)ల్లో దృశ్యాలు గుర్తించిన పోలీసులు(TS POLICE) నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ నెల 4న బాలికను అపహరించుకుపోయిన కిరాతకుడు.. 5న సమీపంలోని గుడిసెల వద్ద వదిలేశాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుడు ఇందు గతంలో ఓ ఫ్యాక్టరీలో పనిచేసి మానేశాడని గుర్తించారు. జులాయిగా వీధుల్లో తిరుగుతూ ఒంటరిగా కనిపించే బాలికలను లక్ష్యంగా చేసుకుంటున్నాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నిన్న మధ్యాహ్నం ఓ బాలికను అపహరించేందుకు యత్నించగా కేకలు వేసింది. వెంటనే తల్లి వచ్చి నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా పారిపోయాడు. కాలనీ వాళ్లు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు జరిపారు.
దమ్మాయిగూడలో గది అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్న నిందితుడు ఇందు ఆచూకీని కనిపెట్టిన పోలీసులు... అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలో ఏడాది క్రితం ఓ బాలికపై జరిగిన లైంగిక దాడి కేసులోనూ ఇందు నిందితుడని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇదీ చదవండి: Alert: పోలవరం ప్రాజెక్టు వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం