తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు గుమ్మడి నర్సయ్య కారు ప్రమాదానికి గురైంది. కొత్తగూడెం నుంచి ఇల్లందు వెళ్తుండగా..టేకులపల్లి మండల పరిధిలో కారు బోల్తాపడింది. వెంటనే స్పందించిన న్యూడెమోక్రసీ నాయకులు ఆయనను కారు నుంచి బయటకు తీశారు.
గుమ్మడి నర్సయ్యకు కాలుతో పాటు పలుచోట్ల స్వల్ప గాయాలు కావడంతో ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోడు భూముల సమస్యపై కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తదితరులు కలిసి ఇల్లందు వస్తుండగా ఈ ఘటన జరిగింది.
5 సార్లు ఎమ్మెల్యేగా ఘనత..
సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ నుంచి గుమ్మడి నర్సయ్య 5 సార్లు ఇల్లందు ఎమ్మెల్యేగా సేవలందించిన ఘనత ఉంది. ఆయన ఇటీవల కరోనా బారినపడి వైరస్‌ను జయించారు. మరోవైపు గుమ్మడి రాజకీయ నేపథ్యం విశేషాలతో ఆయన పేరుమీద సినిమా చిత్రీకరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
సైకిల్ ఎమ్మెల్యేగా గుర్తింపు..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సైకిల్ ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య. నాలుగో సారి శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత.. పార్టీ నుంచి మోటార్ బైక్, జీపు వచ్చాయి. అయినా తనకు సైకిల్‌పై ఉన్న అభిమానంతో ఎప్పుడూ దాన్నే ఉపయోగించేవారు. 63 ఏళ్ల వయస్సులోనూ ఆయన.. అప్పుడప్పుడు సైకిల్‌పైనే షికారుకు వెళ్తుంటారు.
ఇదీ చూడండి: బాలుడిని చితకబాదిన ట్యూషన్ టీచర్... పోలీసులకు ఫిర్యాదు