తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం తహసీల్దార్ సునీత ఏసీబీ వలకు చిక్కారు. హరికృష్ణ అనే ఓ రైతు వద్ద నుంచి రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా అధికారులు ఆమెను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
కాటారం మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన వికలాంగుడు ఐత హరికృష్ణ అనే రైతు కొత్తపల్లి శివారులోని సర్వే నెంబరు 3లో గల 4.25 గుంటల తన భూమిని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని దరఖాస్తు చేసుకున్నాడు. రోజులు గడిచినా ఆన్‌లైన్‌లో నమోదు చేయకపోవడంతో తహసీల్దార్ సునీతను ఆశ్రయించాడు. రూ.5 లక్షలు లంచం ఇస్తేనే భూమిని ఆన్‌లైన్‌లో నమోదు చేస్తానని చెప్పడంతో హరికృష్ణ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
తహసీల్దార్‌తో కుదుర్చుకున్న ముందస్తు ఒప్పందం మేరకు తొలి విడతగా రూ.50 వేలు ఇచ్చాడు. రెండో విడతలో మరో రూ.2 లక్షలు లంచం ఇస్తుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు సునీతను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
కొత్తపల్లి శివారులోని సర్వే నెంబర్ 3లో నాకు 4.25 గుంటల భూమి ఉంది. ఈ భూమికి కొత్త పాసు పుస్తకాల కోసం అడిగితే సంతకం పెట్టేందుకు ఎమ్మార్వో రూ.5 లక్షలు అడిగారు. రూ.3 లక్షలకు ఒప్పందం కుదిరింది. మొదటి విడతలో రూ.50 వేలు ఇచ్చాం. తర్వాత నాకు డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ అధికారులను ఆశ్రయించాను. ఈరోజు రూ.2 లక్షలు ఇస్తుండగా అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.-హరికృష్ణ, బాధిత రైతు