ఆరోగ్య రంగంలో నూతన పోకడలను ఒకచోట చేర్చి.. క్షేత్రస్థాయిలో వైద్య సేవలందిస్తున్న డాక్టర్ల నైపుణ్యాన్ని పెంపొందించే అకాడమీ ఆఫ్ క్లినిషియన్స్ తొలి సదస్సుకు హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీ వేదికైంది. ప్రాథమిక ఆరోగ్య రంగంలో వైద్యుల నైపుణ్యాన్ని వృద్ధి చేయడం, మెలకువలు నేర్పటమే ప్రధాన ధ్యేయంగా అకాడమీ ఆఫ్ క్లినిషియన్స్ ఏర్పడింది. ఫిల్మ్‌సిటీలో ప్రారంభమైన సదస్సుకు లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి శ్రీదేవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఫిజిషియన్స్, వైద్య విద్యార్ధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. కరోనా కాలంలో ఎన్నో ఇబ‌్బందులను ఎదుర్కొని రోగులకు సేవ చేస్తున్న వైద్యులు... ప్రపంచ వ్యాప్తంగా ఈ రంగంలో వస్తున్న మార్పులను బోధించడమే సదస్సు ముఖ్య ఉద్దేశమని ప్రముఖ వైద్యులు, క్లినిషియన్స్ వ్యవస్థాపకులు జగదీశ్‌కుమార్ అన్నారు.
కరోనా ఉద్ధృతిలో చాలా మంది వైద్యులు, వైద్య విద్యార్థులు తమ నైపుణ్యాన్ని మెరుగుపర్చుకోలేదని.. క్లినికల్ పరిజ్ఞానం కూడా పొందలేని వారికి అకాడమీ ఆఫ్ క్లినిషియన్స్ సహకరిస్తుందని వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా వైద్య రంగంలో వస్తున్న మార్పులు, అధునాతన సాంకేతికత పరిజ్ఞానాన్ని ఒక చోట చేర్చి.. వారి మేధస్సును పెంపొందిస్తోందని తెలిపారు. దీని ద్వారా సామాన్యులకు మెరుగైన వైద్యం అందుబాటులోకి వస్తోందని జగదీశ్ కుమార్ చెప్పారు.
వయసుతో సంబంధం లేకుండా మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోందని ఆపోలో వైద్యులు జయప్రకాశ్ సాయి పేర్కొన్నారు. ఇలాంటి సదస్సుల ద్వారా మధుమేహ రోగులకు అందించే నూతన వైద్య పరిజ్ఞానం అందరికీ చేరువవుతుందని స్పష్టం చేశారు. మధుమేహంపై గ్రామీణుల్లో అవగాహన కల్పించడంలో అకాడమీ ఆఫ్ క్లినిషియన్స్ ముందుంటుందని వివరించారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న వైద్యులకు కూడా న్యాయ అవగాహన ఎంతో అవసరమని లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి శ్రీదేవి చెప్పారు. మెడికో లీగల్ కేసులు ప్రతిరోజూ పెరుగుతున్నాయని.. ఈ కేసుల్లో వైద్య సేవలు ఎలా అందించాలో తెలుసుకునేందుకు ఇలాంటి సెమినార్లు దోహదపడతాయని ఆమె తెలిపారు.