అఖిల భారత సర్వీసుల నిబంధనల ప్రకారం రెండేళ్లకు మించి సస్పెన్షన్ కొనసాగించరాదని.. కాలపరిమితి ముగిసిన తర్వాత దానిపై సమీక్షకు కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశామనడమేమిటంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తరఫు న్యాయవాది సీయూ సింగ్‌పై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2020 మే 22న ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పిటిషన్‌ను జస్టిస్ ఏ.ఎం.ఖన్విల్కర్, జస్టిస్ అభయ్ ఎస్.ఓకా, జస్టిస్ సి.టి.రవికుమార్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.
1969 అఖిల భారత సర్వీసుల నిబంధనల ప్రకారం సస్పెన్షన్ రెండేళ్లకు మించి కొనసాగకూడదని.. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌ను విచారించడానికి కారణాలేమీ కనిపించడం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అవినీతి ఆరోపణలకు సంబంధించి విచారణ పూర్తయినందున ఏం చర్యలు తీసుకోవాలనే దానిపై నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశామని సీయూ సింగ్ ధర్మాసనానికి విన్నవించారు. అధికారిని ఎప్పుడు సస్పెండ్ చేశారని ధర్మాసనం ప్రశ్నించగా.. 2020 ఫిబ్రవరి 8న అని న్యాయవాది తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 7కే రెండేళ్లు పూర్తయ్యాయని, కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడు సిఫార్సు చేశారని ధర్మాసనం ప్రశ్నించింది. క్రిమినల్ ప్రొసీజర్స్‌కు సంబంధించి మార్చి 27న కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశామని, అధ్యయనానికి కేంద్రం యూపీఎస్సీకి పంపిందని.. రివ్యూ కమిటీ వేసిందని సీయూ సింగ్ తెలిపారు. రెండేళ్లు పూర్తవకముందే లేఖ రాయాలని, ఆ తర్వాత లేఖ రాస్తే చెల్లదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌లో జోక్యం చేసుకునేందుకు తమకు ఏ కారణాలూ కనిపించడం లేదని అభిప్రాయపడింది. నిర్ణీత గడువు ముగిసిన తర్వాత సిఫార్సు చేశారంటే అప్పటికే సస్పెన్షన్ ఉత్తర్వు దానంతంటదే రద్దయిందని స్పష్టం చేసింది. కేంద్రానికి పంపిన సిఫార్సు ఏ దశలో ఉందో తెలుసుకునేందుకు తనకు మరో రోజు సమయం కావాలని సీయూ సింగ్ కోరారు. న్యాయమూర్తులు ప్రశ్నించే సమయంలో, ఆదేశాలిస్తున్న సమయంలో సీయూ సింగ్ పదే పదే అడ్డుతగులుతుండటంతో జస్టిస్ ఖన్విల్కర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఇలాగే వ్యవహరిస్తే ఈ రోజే విచారణ ముగిస్తామని హెచ్చరించారు. చివరకు సిఫార్సు ఏ దశలో ఉందో తెలుసుకునేందుకు శుక్రవారం వరకు ధర్మాసనం గడువిచ్చింది. సిఫార్సు ఏ దశలో ఉన్నప్పటికీ రెండేళ్ల గడువు ముగిసిన తర్వాత సస్పెన్షన్ ఎత్తివేతను అది అడ్డుకోలేదని ఉత్తర్వుల్లో పేర్కొంది. విచారణను నేటికి వాయిదా వేయడంతో పాటు తుది ఉత్తర్వులు ఇస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. విచారణ ప్రారంభం కాగానే కేసును పాస్ ఓవర్ చేయాలని.. ఈ కేసును గతంలో సీయూ సింగ్ వాదించారని ఆయన తరపు జూనియర్ న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. అయితే మేమేం చేయాలని జస్టిస్ ఖన్విల్కర్ ప్రశ్నించారు. ప్రతి కేసు విచారణలో, చివరకు సగం విన్న కేసుల్లోనూ విచారణకు హాజరయ్యేందుకు న్యాయవాదులు సకాలంలో రావడం లేదని, వచ్చినా విచారణకు సిద్ధంగా ఉండటం లేదని అసహనం వ్యక్తం చేశారు.
సంబంధిత కథనాలు:
- ఇంటెలిజెన్స్ మాజీచీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్
- ప్రభుత్వం నాపై విధించిన సస్పెన్షన్ దానంతట అదే తొలగిపోయింది: ఏబీ వెంకటేశ్వరరావు