Thief died at chandrayangutta : చోరీ కోసం వచ్చిన ఓ దొంగకు అతడు ధరించిన వస్త్రమే మృత్యుపాశమైంది. గేటు దూకే క్రమంలో లుంగీ ఉరిలా బిగుసుకుపోవడంతో వేలాడుతూ ప్రాణాలొదిలాడు ఆ వ్యక్తి. ఈ ఘటన తెలంగాణలోని హైదరాబాద్ చాంద్రాయణగుట్ట ఠాణా పరిధిలో శనివారం వెలుగులోకి వచ్చింది.
పీఎస్సై హసీనా కథనం ప్రకారం.. బార్కస్‌లోని జమాల్‌బండ ప్రాంతానికి చెందిన హుస్సేన్ బిన్ అలీ జైదీ (52) మద్యానికి బానిసై, దొంగతనాలకు అలవాటుపడ్డాడు. శుక్రవారం తెల్లవారుజామున సలాలా పీలిదర్గా రోడ్డులో ఉన్న పాత మోటారు విడిభాగాల గోదాంలో చోరీకి వెళ్లాడు.
ప్రహరీకి ఉన్న పెద్ద గేటు ఎక్కి, దూకుతుండగా.. అతను కట్టుకున్న లుంగీ గేటుకు చిక్కుకుంది. నడుం వద్ద లుంగీ ముడివేసి ఉండటంతో ఊడిరాలేదు. పొట్ట, ఛాతీ భాగం దగ్గర అది చుట్టుకుపోయి, ఊపిరాడక అక్కడే ప్రాణాలు విడిచాడు. గోదాం నిర్వాహకులు మధ్యాహ్నం అక్కడికి వెళ్లినప్పుడు గేటుకు మృతదేహం వేలాడుతూ కనిపించింది. వారిచ్చిన సమాచారంతో పోలీసులు వచ్చి మృతదేహాన్ని తరలించారు.
ఇదీ చదవండి: MURDER: ఆమె వేరే వ్యక్తితో వెళ్లిపోయిందన్న కోపంతో హత్యాకాండకు తెగించాడు