డిజిటల్ మహానాడు-2021ను తెలుగుదేశం శ్రేణులంతా కలసికట్టుగా విజయవంతం చేయాలని... పార్టీ అధినేత చంద్రబాబు శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా నాయకులు, కార్యకర్తలకు డిజిటల్ ఆహ్వానం పంపారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఏటా మహానాడు జరుపుకోవటం ఆనవాయితీ అన్న చంద్రబాబు... తెదేపా కార్యకలాపాలను, భవిష్యత్ కార్యక్రమాలకు ఈ వేడుక ద్వారా మార్గనిర్దేశనం చేసుకుంటామని గుర్తుచేశారు.
కరోనా కారణంగా..
మహోత్సవంలా జరగాల్సిన పసుపు పార్టీ పండుగను కరోనా కారణంగా ఈసారీ డిజిటల్ వేదికగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మే 27, 28 తేదీలలో ఆన్లైన్లో జరిగే డిజిటల్ మహానాడు 2021లో కరోనా కట్టడిలో ఏపీ ప్రభుత్వ వైఫల్యం, రెండేళ్లలో వైకాపా ప్రభుత్వం చేసిన తప్పులు, అప్పులు, స్కాములు తదితర అంశాలపై తీర్మానం చేయనున్నట్లు వెల్లడించారు.
వరుసగా రెండో ఏడాదీ..
ప్రజా సమస్యలపై చర్చే ప్రధాన అజెండాగా... ఇవాళ, రేపు తెలుగుదేశం మహానాడు నిర్వహిస్తోంది. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా.. ఏటా మూడు రోజుల పాటు అట్టహాసంగా జరిగే మహానాడుని.. కరోనా ఉద్ధృతి వల్ల వరుసగా రెండో ఏడాదీ వర్చువల్‌గానే నిర్వహిస్తున్నారు.
ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు..
ఈ ఉదయం అభ్యర్థుల నమోదుతో మహానాడు ప్రారంభం కానుంది. రెండు రోజులూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కార్యక్రమం జరగనుంది. డిజిటల్ మహానాడులో భాగస్వాములవ్వాలని తెలుగు రాష్ట్రాల్లోని... పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు, దేశ, విదేశాల్లోని అభిమానులను పార్టీ అధినేత చంద్రబాబు ఆహ్వానించారు.
ఏపీకి 4, తెలంగాణకు 2 తీర్మానాలు..
తొలి రోజు ఏపీకి సంబంధించిన 4, తెలంగాణకు సంబంధించిన 2 తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. రెండో రోజు మహానాడులో పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తూ తీర్మానం ప్రవేశపెడతారు.
ఇదీ చదవండీ... అక్రమ కేసులు పెట్టిన పోలీసులను వదలం: అచ్చెన్నాయుడు