Plastic: మానవాళి మనుగడకు సవాల్ విసురుతున్న వాటిల్లో ప్లాస్టిక్ భూతం ఒకటి. ప్లాస్టిక్ వినియోగం కారణంగా కాలుష్యం పెరిగిపోతోంది. పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ ఉత్పత్తులను పూర్తిగా నిషేధించాలన్న కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ఆదేశాలతో... జులై 1 తేదీ నుంచి ప్లాస్టిక్ నిషేధం అమలుకు గుంటూరు నగరపాలక సంస్థ సిద్ధమైంది. గతేడాది నవంబరు 9 నుంచి ప్లాస్టిక్ సంచుల వినియోగంపై దశలవారీ నిషేధం అమలు చేస్తున్నారు. తొలిదశలో 20 మైక్రాన్లలోపు, క్రమంగా 40, 70 మైక్రాన్లలోపు బరువున్న కవర్లపై జీఎంసీ నిషేధం విధించింది. ఇప్పుడు మందంతో సంబంధం లేకుండా ప్లాస్టిక్ కవర్లనే పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది.
నగరంలో రోజుకు 450 టన్నులకుపైగా చెత్త వెలువడుతోంది. అందులో 100 టన్నులకు పైగా ప్లాస్టిక్ సంచులు, డబ్బాలు ఉంటున్నాయి. వాటిని కాల్వల్లో, రహదారులపై పడేయటం వల్ల పారిశుద్ధ్య సమస్య తలెత్తుతోంది. ఆహార పదార్థాలను ప్లాస్టిక్ సంచుల్లో పడేయటంతో వాటిని తిన్న మూగజీవాలు ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నాయి. అందుకే సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం ఒక్కటే ఇలాంటి సమస్యలకు అడ్డుకట్ట వేస్తుందని యంత్రాంగం భావిస్తోంది.
నగరపాలక సంస్థ ఆదేశాలను ఉల్లంఘిస్తే జరిమానాలు విధించేందుకు కూడా కార్యాచరణ సిద్ధం చేశారు. తయారీదారులకు 50 వేల నుంచి లక్ష రూపాయల వరకూ, చిల్లర వర్తకులకు 2వేల 500 నుంచి 15వేల రూపాయల వరకూ అపరాధ రుసుము వసూలు చేస్తారు. ఒకవేళ ప్రజలెవరైనా ప్లాస్టిక్ కవర్లతో కనిపిస్తే వారికి 100 నుంచి 250 రూపాయల వరకూ జరిమానా విధించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
"నగరపాలక సంస్థ ఆదేశాలను ఉల్లంఘిస్తే జరిమానాలు విధించేందుకు కూడా కార్యాచరణ సిద్ధం చేశాం. తయారీదారులకు 50 వేల నుంచి లక్ష రూపాయల వరకూ, చిల్లర వర్తకులకు రూ.2వేల 500 నుంచి రూ.15వేల వరకూ అపరాధ రుసుము వసూలు చేస్తారు. ఒకవేళ ప్రజలెవరైనా ప్లాస్టిక్ కవర్లతో కనిపిస్తే వారికి రూ.100 నుంచి రూ.250 వరకూ జరిమానా విధిస్తాం" -గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు.
గుంటూరును ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చేందుకు.... సచివాలయాల ఉద్యోగులు, వాలంటీర్లతో ప్రజలకు అవగాహన కల్పించనున్నారు.
ఇవీ చదవండి: