వానరాలకు విషం పెట్టి చంపి... మృతదేహాలను బహిరంగ ప్రదేశంలో వదిలివెళ్లిన హృదయవిదారక ఘటన తెలంగాణ.. మహబూబాబాద్ జిల్లా శనిగపురం శివారులో జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన జిల్లాలో కలకలం రేపుతోంది. ఒకటి కాదు రెండు కాదు సుమారు యాభై నుంచి ఆరవై కోతులు చనిపోయి కుప్పలుగా పడి ఉండటాన్ని చూసి స్థానికులు ఆవేదన చెందారు.
పొలం పనులకు వెళ్లే క్రమంలో గుట్టల మధ్య నుంచి వాసన వస్తుండగా.. పరిశీలించిన స్థానికులకు వానరాల మృతదేహాలు కుప్పలుగా పడి ఉండటం కనిపించింది. ఎవరు చంపారో... ఎందుకు చంపారో... ఎక్కడ చంపారో తెలియదు.. చనిపోయిన వాటిని మాత్రం సంచుల్లో తీసుకొచ్చి గుట్టల మాటున పడేశారు. ఈ ఘటనతో శనిగపురంలో విషాదం నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. కేసు నమోదు చేసిన అధికారులు పంచనామా నిర్వహించనున్నారు. వానరాలను చంపిన వారిని కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు కోరుతున్నారు.