ఉద్యోగ నియామకాల ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా కసరత్తు ప్రారంభమైంది. ఆయా శాఖల్లోని వాస్తవ ఖాళీల వివరాలను తేల్చేందుకు ఆర్థికశాఖ రెండు రోజలుగా సమావేశాలు నిర్వహించింది. అన్ని శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులతో ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు శని, ఆదివారాల్లో సమావేశమయ్యారు. గతంలో ఆయా శాఖలు ఇచ్చిన ఖాళీల వివరాలను సమీక్షించారు.
జిల్లా, జోనల్, మల్టీ జోనల్ వారీగా ఖాళీ పోస్టుల వివరాలను ఆయా శాఖలు నివేదించాయి. 53 వేల వరకు ఖాళీలు ఉన్నట్లు ఆయా శాఖలు గతంలో తేల్చగా... తాజాగా మొత్తం ఖాళీలు 55 వేలకు పైగా ఉన్నట్లు నివేదించాయి. హోం, విద్య, వైద్య-ఆరోగ్య, సంక్షేమ శాఖల్లో ఖాళీలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 నుంచి 61 ఏళ్లకు పెంచారు. మార్చి చివరి నుంచి ఇది అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఆ తర్వాత ఖాళీలు పెద్దగా ఏర్పడలేదు. స్వచ్ఛంద పదవీ విరమణలు, రాజీనామాలు, కొత్త పోస్టుల కారణంగా స్వల్ప పెరుగుదల ఉంది.
ఆర్థిక శాఖ నివేదిక..
ఖాళీల్లో కొంత మంది ఒప్పంద, పొరుగుసేవల పద్ధతిలో పనిచేస్తున్నారు. ఆకస్మిక మరణాలు, అనారోగ్య కారణాలతో పదవీ విరమణ తీసుకున్న పోస్టుల ఖాళీలను ప్రత్యేకంగా పేర్కొన్నారు. అలాంటి వారి స్థానంలో కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చేలా కారుణ్య నియామకాల ప్రక్రియను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను గతంలోనే ఆదేశించారు. దీంతో ఆ పోస్టులను విడిగా పేర్కొన్నారు. పదోన్నతుల ద్వారా వచ్చే ఖాళీల వివరాలనూ అందించారు. అన్ని శాఖలు ఇచ్చిన వివరాలను క్రోడీకరించి ఆర్థికశాఖ నివేదిక రూపొందించనుంది.
రేపే కీలక నిర్ణయం..?
రేపు జరగనున్న మంత్రివర్గ సమావేశానికి నివేదిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులను ఆదేశించారు. దీంతో కేబినెట్ భేటీకి ఉద్యోగ నియామకాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సిద్ధం చేయనున్నారు.
ఇదీచూడండి: