రాష్ట్రానికి 3 రాజధానుల అంశాన్ని ప్రభుత్వం తెరపైకి తీసుకువచ్చింది. చట్టసభల రాజధానిగా అమరావతి, పాలనాపరమైన రాజధానిగా విశాఖపట్నం, న్యాయపాలనా రాజధానిగా కర్నూలు ఉండొచ్చని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. శాసనసభలో సూచనప్రాయంగా వెల్లడించారు. మరో నాలుగైదు రోజుల్లోనే రాజధాని సహా రాష్ట్రంలోని కీలక ప్రాజెక్టులపై నిపుణుల కమిటీ నివేదిక ఇవ్వనున్న తరుణంలో.. ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. అమరావతి కట్టాలంటే లక్ష కోట్లు కావాల్సి వస్తుందని ప్రభుత్వం పదేపదే వివిధ వేదికలపై చెబుతోంది. ఇప్పటి వరకు అమరావతి రాజధానిగా కొనసాగుతుందా లేదా అనే సందేహాల నడుమ ఏపీకి మూడు రాజధానులు అవసరమని ముఖ్యమంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై ఇప్పటికే ప్రభుత్వం నియమించిన అధికారిక కమిటీలు నివేదిక ఇచ్చిన తరువాత.. సరైన నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది.
వైకాపా ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఈ ఆరు నెలల కాలంలో రాజధానిగా అమరావతిని కొనసాగిస్తారా లేదా అన్నదానిపై సందేహాలు వ్యక్తమయ్యాయి. పలువురు మంత్రులు వివిధ రకాలుగా వ్యాఖ్యలు చేయడంతో రాజధానిగా అమరావతి భవిష్యత్ పై అనుమానాలు మొదలయ్యాయి. అయినా.. ప్రభుత్వం దీనిపై ఇన్నాళ్లూ స్పష్టమైన ప్రకటన చేయలేదు. శాసనసభ వేదికగా మంగళవారం ముఖ్యమంత్రి జగన్.. మూడు రాజధానులు అనే మాట తేవడంతో వైకాపా ఆ దిశగా ఆలోచిస్తుందేమోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం ఉన్న అమరావతిని లెజిస్లేచర్ కేపిటల్ గా కొనసాగిస్తూ.. విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేయవచ్చు అనే ఆలోచనను సీఎం బయటపెట్టారు. విశాఖలో మెట్రో రైలు లాంటి రవాణా సదుపాయాలు కల్పిస్తే ఎగ్జిక్యూటివ్ రాజధానిగా అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు పెద్ద ఎత్తున వినిపిస్తున్న తరుణంలో ఆ ప్రాంతంలోనూ జ్యుడీషియరీ కేపిటల్ ఏర్పాటును ముఖ్యమంత్రి ప్రస్తావించారు. రాయలసీమకు నీటి తరలింపు, అన్ని ప్రాంతాలకు తాగునీరు, ఆసుపత్రులు, పాఠశాలల అభివృద్ధికి వేలకోట్లు అవసరం ఉందని.. ఈ పరిస్థితుల్లో కేవలం 20 కిలో మీటర్ల పరిధి కోసం లక్ష కోట్లు ఖర్చు చేయటం సమంజసం కాదని సీఎం వ్యాఖ్యానించారు. అమరావతి కోసం లక్ష కోట్లు ఖర్చు చేసే పరిస్థితిలో ప్రభుత్వం లేదని సీఎం అన్నారు. దీంతో.. రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల దిశగా ఆలోచనలు చేస్తుందేమో అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికైతే.. నిపుణుల వచ్చాకే స్పందిస్తామని ప్రభుత్వం చెబుతోంది.