రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. వరుసగా రెండో రోజూ 20 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 1,16,367 శాంపిల్స్ పరీక్షించగా.. రాష్ట్ర వ్యాప్తంగా 22,204 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్టు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. అలాగే, 85 మంది మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 1,69,50,299 శాంపిల్స్ పరీక్షించగా.. 12,06,232మందికి పాజిటివ్‌గా తేలింది. వీరిలో 10,27,270మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 8374మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,70,588 క్రియాశీల కేసులు ఉన్నాయి.
విశాఖ, విజయనగరంలో 11మంది మృతి
గడిచిన 24 గంటల్లో తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 2,344 మంది కరోనా బారిన పడ్డారు. అత్యల్పంగా కడప జిల్లాలో 903 కేసులు నమోదయ్యాయి. ఇక మరణాలను పరిశీలిస్తే.. విశాఖపట్నం, విజయనగరంలలో 11మంది చొప్పున ప్రాణాలు కోల్పోగా.. అనంతపురంలో 10, తూర్పుగోదావరి 9, ప్రకాశం 8, పశ్చిమగోదావరి 7, చిత్తూరు 6, గుంటూరు 5, కర్నూలు 5, నెల్లూరు 5, కృష్ణా 4, శ్రీకాకుళం 3, కడపలో ఒకరు మృతి చెందారు.
ఇదీ చదవండి