రాష్ట్ర బడ్జెట్ స్వరూపం రూ.2 లక్షల కోట్ల లోపే ఉండే అవకాశం కనిపిస్తోంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో అంతకుముందు ఓటాన్ అకౌంట్‌కు దరిదాపుల్లోనే రూ.2,27,974.99 కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్ ప్రతిపాదించారు. ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఒక నెల మాత్రమే ఉండగా ఇంతవరకు సుమారు రూ.1.60 లక్షల కోట్లే ఖర్చుచేశారు. ఆశించిన స్థాయిలో ఆదాయాలు రాకపోవడం, కేంద్రం నుంచి వస్తాయనుకున్న నిధులు అందకపోవడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంచనాలు, వాస్తవ స్వరూపం మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో గతేడాది కన్నా బడ్జెట్‌ను పెంచాలన్న ప్రతిష్ఠ కన్నా.. వాస్తవ పరిస్థితుల ఆధారంగానే ముందుకు వెళ్లాలని ఆర్థికశాఖకు ప్రభుత్వపెద్దలు నిర్దేశించినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో బడ్జెట్ రూ.2 లక్షల కోట్లలోపే నిలిచిపోనుంది. రూ.1.80 - రూ.1.90 లక్షల కోట్ల మధ్య ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదని ఆర్థికశాఖ అధికారుల్లోనే చర్చ సాగుతోంది.
ప్రతిపాదనల దశలోనే కొన్ని మినహాయింపులు
బడ్జెట్ ప్రతిపాదన దశల్లోనే కొన్ని అంశాలు ఈ బడ్జెట్‌లో మినహాయించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్రం నుంచి రెవెన్యూ లోటు రూ.15వేల కోట్ల వరకు రావాల్సి ఉందని ప్రతి ఏడాది బడ్జెట్‌లో ఆదాయంగా చూపుతున్నారు. ఆ నిధులు రాకపోవచ్చని దాదాపు అంచనాకు రావడంతో తాజా బడ్జెట్ ప్రతిపాదనల్లో దాన్ని మినహాయించే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు ప్రతి ఏడాది కేంద్రసాయం రూపంలో పెద్ద మొత్తంలో ప్రతిపాదిస్తున్నారు. దాదాపు మూడేళ్లుగా అంచనాకు, వాస్తవానికి మధ్య పొంతన ఉండట్లేదు. దీంతో ప్రస్తుతం కేంద్రసాయం రూపంలో చూపే మొత్తాలు బాగా తగ్గొచ్చు.వివిధ కారణాలతో రాష్ట్ర సొంత ఆదాయమూ తగ్గింది. కేంద్ర ప్రాయోజిత పథకాల పేరుతో చూపే కేటాయింపులూ ఈసారి తగ్గనున్నట్లు సమాచారం. ఈ అన్నింటి నేపథ్యంలో రాబడులు తగ్గి అంచనాల్లోనూ బాగా మార్పులు రానున్నాయని సమాచారం.
సొంత ఆదాయం జీతాలు, పింఛన్లకే సరి..
రాష్ట్రం నుంచి వచ్చే పన్నులు, పన్నేతర సొంత ఆదాయం దాదాపు ఏడాది మొత్తం ఉద్యోగుల జీతాలు, పింఛన్లకే సరిపోవచ్చని అంచనా. మొత్తం ఆదాయం దాదాపు రూ.70వేల కోట్ల వరకు ఉంటుందని, అది దానికే సరిపోతుందని అంటున్నారు. మరోవైపు ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులయ్యారు. టికెట్ల రూపంలోను, ఇతర మార్గాల్లో ఆర్టీసీ నుంచి వచ్చే ఆదాయం పోగా.. మరో రూ. 1100 కోట్ల వరకు జీతాలకే అదనంగా చెల్లించాల్సి వస్తోంది. విద్యావాలంటీర్ల వేతనాలు, కొత్తగా సచివాలయాల ఉద్యోగులకు చెల్లించే జీతాల ప్రభావం ప్రస్తుత ఏడాదితో పోలిస్తే కొత్త ఆర్థిక సంవత్సరంలో మరింత పెరగనుంది.
సంక్షేమానికే పెద్ద మొత్తాలు
ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం ఇస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వీటికి రూ.45వేల కోట్ల వరకు ఖర్చుచేసినట్లు చెబుతున్నారు. వచ్చే సంవత్సరం నుంచి ఇది రూ.65వేల కోట్లకు చేరే అవకాశం ఉంది. ఇక ప్రతినెలా వడ్డీలు, అసలు తదితరాలు పోతే ప్రాజెక్టులు, ఇతరత్రా కీలక రంగాలకు వెచ్చించే నిధుల కోసం రుణాలపై ఆధారపడవలసి రావచ్చు. ఇప్పటికే ఆ మేరకు ప్రయత్నాలూ ప్రారంభమయ్యాయి.
ఇదీ చదవండి: '2021 జూన్ నాటికి పోలవరం పూర్తి కావాల్సిందే..!'