kharif investments subsidy: గత ప్రభుత్వం వదిలిన బకాయిలన్నీ తామే చెల్లిస్తున్నామని తరచూ చెప్పే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి.. 2018 ఖరీఫ్, రబీ నాటి కరవు సాయాన్ని మరచిపోయారు. అధికారంలోకి వచ్చాక జమ్మలమడుగులో నిర్వహించిన తొలి రైతు దినోత్సవం రోజు ఇచ్చిన హామీ.. రెండున్నరేళ్లు గడిచినా ఇంకా అమలు చేయలేదు. పెట్టుబడి సాయంగా కేంద్రం నుంచి మంజూరైన రూ.900 కోట్లనూ రైతులకు ఇవ్వలేదు. కరవు ప్రభావంతో 2018 ఖరీఫ్, రబీల్లో మొత్తం 43 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. పెట్టుబడి రాయితీగా రైతులకు రూ.2,371 కోట్లు చెల్లించాలని అధికారులు అంచనా వేశారు. కేంద్రానికి నివేదిక పంపారు. ఈలోగా ఎన్నికలు జరిగి, రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో చెల్లించాల్సిన రూ.2వేల కోట్ల పెట్టుబడి రాయితీ బకాయిల్ని తామే చెల్లిస్తామని చెప్పిన సీఎం.. అధికారులతో సమీక్ష సందర్భంలోనూ 2019 నవంబరులోగా చెల్లించాలని సూచించారు. రెండున్నరేళ్లు దాటినానిధులు మాత్రం కర్షకుల ఖాతాల్లో జమ కాలేదు.
2018 ఖరీఫ్‌లో కరవుకు సంబంధించి పెట్టుబడి రాయితీ బకాయిలు రూ.2వేల కోట్లు ఉన్నాయి. గత ప్రభుత్వం చెల్లించాల్సిన ఆ బకాయిల్ని మేమే చెల్లిస్తాం. అందుకు అనుగుణంగా సంతకాలు చేశామని చెప్పడానికి గర్వపడుతున్నా. - 2019 జులై 8న కడప జిల్లా జమ్మలమడుగులో నిర్వహించిన రైతు దినోత్సవంలో సీఎం జగన్
2014-15 నుంచి 2018-19 మధ్య కాలంలో ప్రభుత్వం మంజూరు ఇవ్వనందున 24.80 లక్షల మందికి రూ.2,558 కోట్ల పెట్టుబడి రాయితీని విడుదల చేయలేదు. వాటిని చంద్రబాబు ఎగ్గొట్టారు. - మార్చి 21న శాసనసభలో వ్యవసాయ మంత్రి కన్నబాబు
ఇస్తారో.. ఇవ్వరో చెప్పరేం!
2014-19 మధ్య రూ.2,558.07 కోట్ల పెట్టుబడి రాయితీని చంద్రబాబు ఎగ్గొట్టారని అసెంబ్లీలో చెప్పిన వ్యవసాయ మంత్రి కన్నబాబు.. వాటిని తమ ప్రభుత్వం చెల్లిస్తుందో, లేదో మాత్రం చెప్పలేదు. పాత బకాయిలన్నీ ఇస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పే మాటల ప్రకారం.. ఈ రూ.2,558.07 కోట్లను రైతులకు జమ చేయాల్సి ఉంది. అలా కాదు, 2018 నాటి బకాయిల వరకే అనుకున్నా వాటినీ ఇవ్వలేదు. దీనిపై వ్యవసాయశాఖ అధికారులూ స్పందించడం లేదు.
2018 ఖరీఫ్‌లోనే 34 లక్షల ఎకరాలు.. రూ.1,869 కోట్లు
2018 ఖరీఫ్‌లో కరవు కారణంగా రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది జిల్లాల్లోని 347 మండలాల్లో 16.52 లక్షల మంది రైతులకు చెందిన 34 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు ప్రభుత్వం తేల్చింది. వీరికి కేంద్ర మార్గదర్శకాల ప్రకారం రూ.979 కోట్లు, రాష్ట్ర మార్గదర్శకాల ప్రకారం రూ.1,869 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. తర్వాత కేంద్రం నుంచి ఉన్నతస్థాయి బృందమూ వచ్చి పంటలను పరిశీలించింది. వారి సిఫారసు మేరకు 2019లో కేంద్రం నుంచి రూ.900.40 కోట్లు విడుదలయ్యాయి. ఇప్పటికీ ఇవి రైతుల ఖాతాల్లో మాత్రం జమ కాలేదు. అత్యధికంగా అనంతపురం జిల్లా రూ.890 కోట్లు, కర్నూలు జిల్లా రూ.616 కోట్లు, ప్రకాశం జిల్లా రూ.139కోట్లు, చిత్తూరు జిల్లా రైతులకు రూ.119 కోట్లు చెల్లించాలి.
రబీ సాయానికి నీళ్లు
2018-19 రబీలోనూ వర్షాలు అనుకూలించలేదు. వర్షాభావ పరిస్థితుల కారణంగా అయిదు జిల్లాల్లో 9.12 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కేంద్ర మార్గదర్శకాల ప్రకారమైతే రూ.359.54 కోట్లు, రాష్ట్ర మార్గదర్శకాల ప్రకారమైతే రూ.502 కోట్లు పెట్టుబడి రాయితీగా చెల్లించాల్సి ఉంటుందని అధికారులు నివేదికలు రూపొందించారు. అయితే నిర్దేశిత గడువులోగా నివేదిక పంపలేదని, కరవు ప్రకటన సమయంలో క్షేత్రస్థాయిలో కరవు తీవ్రతను సరిగా అంచనా వేయలేదని పేర్కొంటూ కేంద్రం సాయానికి నిరాకరించింది. నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వమూ సాయం అందించలేదు. నిధుల విడుదలపై వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, కమిషనర్ అరుణ్‌కుమార్‌ను సంప్రదించే ప్రయత్నం చేయగా ఫోన్‌కు స్పందించలేదు.
2018 ఖరీఫ్‌కు సంబంధించి కరవు సాయంగా 2019 మే నెలలో కేంద్రం రూ.900.40 కోట్లు విడుదల చేసింది. ఈ విషయాన్ని లోక్‌సభలో పలుమార్లు ప్రస్తావించింది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ 2019 జూన్ 24న నిర్వహించిన సమీక్షలోనే ఈ మేరకు అధికారులు పూర్తి వివరాలతో ప్రజంటేషన్ ఇచ్చారు. అయినా రైతులకు మాత్రం నేటికీ కరవు సాయం అందలేదు.
ఇదీ చదవండి:వైకాపా పాలకులకు కూల్చడం తప్ప, కట్టడం రాదు: చంద్రబాబు