ఆర్థికాభివృద్ధికి ఆస్తుల కల్పన ముఖ్యం. అప్పులు చేసినా ఆ సొమ్మును ఆస్తుల కల్పనకు వినియోగిస్తేనే భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఇప్పుడు కేంద్రప్రభుత్వం రాష్ట్రాల అప్పులకు, ఆస్తుల కల్పనకు ముడిపెట్టింది. ఆస్తుల కల్పనకు ఉపయోగపడే పెట్టుబడి వ్యయానికి లక్ష్యాలు విధిస్తోంది. దీనిపై మూడు నెలలకోసారి సమీక్షించి, తగినంత పెట్టుబడి వ్యయం లేకపోతే రాష్ట్రం తీసుకోగలిగే రుణ పరిమితిలో కోత విధిస్తామని కేంద్రం స్పష్టం చేసింది.
ఈ సమీక్ష రాబోయే సెప్టెంబరు, డిసెంబరు, మార్చి నెలల్లో జరగనుంది. అంతా సవ్యంగా ఉంటే సరే.. లేకపోతే రుణాల సేకరణ పరిమితికి కోత తప్పదు. మరుసటి ఆర్థిక సంవతర్సంలోని జూన్‌లో మరోసారి సమీక్షించి తదుపరి ఆర్థిక సంవత్సరంలో రుణ పరిమితికి మరింత కోతపెడుతుంది. ఈ మేరకు కేంద్రం కొత్త మార్గదర్శకాలను రాష్ట్రప్రభుత్వానికి తెలియజేసింది. వీటి ప్రకారం.. రాష్ట్రప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021-22) రూ.27,589 కోట్ల పెట్టుబడి వ్యయం చేయాలని కేంద్రం నిర్దేశించింది. లేకపోతే రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 0.50%.. అంటే రూ.5,309 కోట్లకు పైగా నికర రుణ పరిమితి తగ్గుతుంది. 2022 జూన్‌లో దీనిపై కేంద్రం పూర్తిగా సమీక్షించి, 2021-22 ఆర్థిక సంవత్సరంలో చేసిన పెట్టుబడి వ్యయాన్ని పరిశీలిస్తుంది. ఆ మేరకు ఖర్చుచేయకపోతే 2022-23 ఆర్థిక సంవత్సరంలో నికర రుణ పరిమితిలో అది సర్దుబాటు చేయాలని నిర్ణయించింది. ఈ లెక్కలు కట్టేందుకు కాగ్ ప్రతినెలా రూపొందించే ఖర్చుల నివేదికను ప్రాతిపదికగా తీసుకుంటామని కేంద్రం తెలిపింది.
ఆర్థిక సమీక్ష ఇలా...
సెప్టెంబరులో కేంద్రం తొలి సమీక్ష చేస్తుంది. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో పెట్టుబడి వ్యయాన్ని గమనిస్తుంది. ఏడాదిలో చేయాల్సిన పెట్టుబడి వ్యయంలో తొలి మూడు నెలల్లో 20% ఖర్చు పెట్టాలి. 2021-22లో తొలి మూడు నెలల్లో రూ.5,517 కోట్ల పెట్టుబడి వ్యయం చేయాలి. అలా చేస్తే కోతపెట్టిన దాంట్లో 0.25% అదనపు రుణ పరిమితి కల్పిస్తారు.
* 2021 డిసెంబరులో రెండో సమీక్ష నిర్వహిస్తుంది. తొలి ఆరు నెలల్లో పెట్టుబడి వ్యయం ఎంత చేశారో పరిశీలిస్తుంది. మొత్తం పెట్టుబడి వ్యయంలో 45% తొలి ఆరునెలల్లో ఖర్చు చేయాలి. అంటే రాష్ట్రంలో సెప్టెంబరు నెలాఖరు వరకు రూ.12,415 కోట్లు ఖర్చుచేయాలి. అలా చేస్తే కోతపెట్టిన నికర రుణపరిమితిలో 0.50% రుణ పరిమితి పెంచుతారు.
* 2022 మార్చిలో తుది సమీక్ష నిర్వహిస్తారు. అప్పటికి 9 నెలల్లో పెట్టుబడి వ్యయంలో 70% ఖర్చుచేయాలి. అంటే డిసెంబరు నెలాఖరుకు రూ.19,312 కోట్ల మేర పెట్టుబడి వ్యయం చేయాలి. అలా చేస్తే నికర రుణ పరిమితిలో మిగిలిన భాగానికి అనుమతి ఇస్తారు. 70% కన్నా తక్కువగా ఉంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నికర రుణ పరిమితిని తేల్చేందుకు ఒక ఫార్ములా రూపొందించారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో పేర్కొన్న పెట్టుబడి వ్యయం కన్నా 70% మించి ఖర్చుచేస్తే నిష్పత్తి లెక్క తీసి నికర రుణ పరిమితిని తేలుస్తారు. ఇందుకోసం 2019-20లో పెట్టుబడి వ్యయం అంచనా ఎంత? 2018-19లో వాస్తవ పెట్టుబడి వ్యయం ఎంత? అదే సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో పెరుగుదల రేటు ఎంతన్న అంశాల ఆధారంగా ఒక ఫార్ములా ప్రకారం ఇది తేలుస్తారు.