కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో రాష్ట్రం రికార్డు సృష్టించింది. ఆదివారం నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్ ద్వారా ఒక్కరోజే 13 లక్షల 59 వేల 300 మందికి టీకాలు వేసింది. పశ్చిమగోదావరి జిల్లాలో అత్యధికంగా లక్షా 64 వేల మందికి వ్యాక్సిన్ వేశారు.
కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసింది. రికార్డుస్థాయిలో ఒకేరోజు 13 లక్షల 59 వేల మందికి పైగా టీకాలు వేసి ఔరా అనిపించింది. గతంలో ఒకరోజే 6 లక్షల మందికి టీకాలు వేయగా...ఇప్పుడు రెట్టింపు సంఖ్యను దాటేసింది. కనీసం 10 లక్షల టీకాలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా....అంతకు మించి వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగింది. కొన్నిచోట్ల చీకటిపడేవరకు ఆరోగ్య సిబ్బంది టీకాలు వేశారు. టీకా తీసుకోవడంపై పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో....జనం బారులు తీరారు.
పశ్చిమగోదావరి జిల్లాలో అత్యధికంగా లక్షా 64 వేల మందికి టీకాలు వేయగా...ఆ తర్వాత వరుసలో తూర్పుగోదావరి, కృష్ణా, విశాఖ, గుంటూరు ప్రకాశం, చిత్తూరు జిల్లాలు నిలిచాయి. 7 జిల్లాల్లో లక్ష మందికి పైగా టీకా తీసుకున్నారు. విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 62 వేల 314 మందికి వ్యాక్సిన్ వేశారు.
మెగా వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికార యంత్రాంగం ముందస్తు ఏర్పాట్లు చేసింది. ఒకేసారి ప్రజలంతా రాకుండా టోకెన్లు పంపిణీ చేశారు. టీకా కేంద్రాల వద్ద సౌకర్యాలు కల్పించడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ సాఫీగా సాగింది. మొత్తం 40వేల మంది ఆశా కార్యకర్తలతోపాటు మరో 5 వేల మంది సిబ్బంది ఇందులో భాగస్వామ్యమయ్యారు. కొన్ని చోట్ల కొండలు, కోనలు దాటుకొని వెళ్లి టీకాలు వేశారు.
విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం దారపర్తి గిరిజన పంచాయతీకి....రాళ్లదారిలో 12 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి ఆరోగ్య సిబ్బంది గిరిజనులకు టీకాలు వేశారు. ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లులకు, 45 ఏళ్లు పైబడిన వారికి, విదేశాలకు వెళ్లే విద్యార్థులకు టీకాలు వేశారు. దీంతో ఇప్పటి వరకు తొలి, రెండో డోస్ వేసుకున్న వారి సంఖ్య కోటి 36 లక్షల 76 వేలకు చేరింది.
ఇదీ చదవండి:
APSRTC: రేపట్నుంచి తెలంగాణకు బస్సులు నడపాలని ఏపీఎస్‌ఆర్టీసీ నిర్ణయం