ప్రభుత్వ అంబులెన్సుల నిర్వహణకు సంబంధించిన టెండర్ తొలిసారిగా న్యాయపరిశీలనకు వెళ్లింది. 108, 104 అంబులెన్సుల నిర్వహణ కోసం సర్వీసు ప్రొవైడర్ ఎంపికకు సంబంధించిన ఈ టెండర్ వంద కోట్లు దాటడం వల్ల... వైద్య శాఖ దీనిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపించింది. అక్టోబరు మూడో తేదీన ఏర్పాటైన ప్రివ్యూ కమిషన్‌కు వెళ్లిన తొలి టెండరుగా ఇది రికార్డు సృష్టించింది. వైద్య ఆరోగ్య శాఖ, సర్వీసు ప్రొవైడర్ సంయుక్తంగా నిర్వహించే ప్రభుత్వం అంబులెన్సుల నిర్వహణ కోసం ఈ టెండర్‌ను పిలిచారు.
రూ.100 కోట్లు దాటితే న్యాయ పరిశీలనకు
రాష్ట్రంలో రూ.100 కోట్లు దాటితే ఏ టెండరైనా జ్యుడిషియల్ ప్రివ్యూ కమిషన్ ముందుకు వెళ్లాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. తదనుగుణంగానే 108, 104 అంబులెన్సుల నిర్వహణకు సంబంధించిన టెండర్‌ను వంద కోట్లు దాటడం వల్ల హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి. శివశంకర్ రావు చైర్మన్‌గా ఏర్పాటైన జ్యుడిషియల్ ప్రివ్యూ కమిషన్‌కు న్యాయ పరిశీలనకు పంపింది. కమిషన్ సూచించే మార్పులు చేర్పులు పరిశీలించి తదుపరి ఉత్తర్వులను సర్కారు జారీ చేయనుంది.
మరిన్ని వివరాలు పంపండి
ఈ టెండరు ప్రతిపాదనలకు సంబంధించి మరిన్ని వివరాలను పంపించాల్సిందిగా జ్యూడిషియల్ ప్రివ్యూ కమిషన్ వైద్యారోగ్యశాఖను కోరింది. దీనిపై ప్రజల అభ్యంతరాలను తెలుసుకునేందుకు కూడా త్వరలోనే కమిషన్ వెబ్సైట్లోనూ వివరాలను ఉంచనున్నారు. అభ్యంతరాల పరిశీలన అనంతరం జ్యూడిషియల్ ప్రివ్యూ తన సిఫార్సులతో టెండరును వైద్యారోగ్యశాఖకు తిరిగి పంపనుంది. ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ ఒక్కో అంబులెన్సు నిర్వహణకూ నెలకు ఒక లక్షా 35 వేల రూపాయలు ఖర్చు చేస్తోంది. రాష్ట్రంలో సేవలందిస్తోన్న 600 అంబులెన్సుల స్థానే కొత్తవాటిని కొనుగోలు చేయాలని కూడా నిర్ణయించారు. కమిషన్ ఏర్పాటు కంటే ముందే దీనికి సంబంధించిన టెండర్‌ను ప్రభుత్వం జారీ చేసింది. 650 వరకూ 104, 350 వరకూ 108 కొత్త వాహనాలను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది.
ఇదీ చూడండి: