Musk sold tesla shares: సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విట్టర్‌ను కొనుగోలు చేసేందుకు నిధులు సమకూర్చడం కోసం టెస్లా షేర్లను విక్రయించారు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. 4 బిలియన్ డాలర్లు విలువ చేసే 44 లక్షల షేర్లు అమ్మారు. సెక్యూరిటిసీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఫైలింగ్‌లో మస్క్ ఈ వివరాలను వెల్లడించారు. గత కొన్ని రోజులుగా ఈ షేర్లన్నింటినీ 872 డాలర్ల నుంచి 999 డాలర్ల ధరతో కొనుగోలుదారులకు విక్రయించినట్లు పేర్కొన్నారు.
Tesla shares news: గతంలో ఎన్నడూ లేనంతగా టెస్లా షేర్ల విలువ ఒక్క రోజే 12 శాతం పడిపోయిన మంగళవారమే మస్క్ ఎక్కువ షేర్లను అమ్మినట్లు తెలుస్తోంది. అయితే ఇకపై టెస్లా షేర్లను అమ్మే ఆలోచన తనకు లేదని మస్క్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. మస్క్ నిర్ణయంతో టెస్లా ఇన్వెస్టర్లు ఆందోళనకు గురవుతున్నారు. ట్విట్టర్‌పై ఆసక్తితో ఆయన.. ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లాపై ఎక్కువ దృష్టి పెట్టరేమో అని భయపడుతున్నారు.
ఇటీవలే ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు ఎలాన్ మస్క్. ఇందులో 25.5 బిలియన్ డాలర్లను బ్యాంకుల నుంచి రుణాల ద్వారా సమకూర్చనున్నారు. మిగతా మొత్తం పోగు చేసేందుకే టెస్లా షేర్లను కూడా విక్రయించారు. టెస్లా షేర్ల విలువ ఈ ఏడాదే 17 శాతం పతనమైంది. గురువారం మార్కెట్ ముగిసే నాటికి ఒక్కో షేరు విలువ 877.51డాలర్లుగా ఉంది. దీంతో అందులో పెట్టుబడులు పెట్టిన వారు దిగులు చెందుతున్నారు.
ఇదీ చదవండి: ఐపీఓ చరిత్రలో ఎల్‌ఐసీనే టాప్.. తరువాత స్థానాల్లో ఏవంటే..