How To Calculate Income Tax On Your Salary : భారతదేశంలో ఆదాయ పన్ను లెక్కలు చాలా సంక్లిష్టంగా ఉంటాయి. ముఖ్యంగా నెలవారీ జీతాలు సంపాదించే ఉద్యోగులు, తాము కట్టాల్సిన ఇన్‌కం టాక్స్ గురించి లెక్కలు వేసుకోవడం మరింత కష్టంగా ఉంటుంది. కానీ, ఆదాయ పన్నును సరిగ్గా లెక్కించుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే, మన వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించుకోవడానికి, పన్ను నిబంధనలను సక్రమంగా పాటించడానికి ఇది చాలా అవసరం. అందుకే ఈ ఆర్టికల్‌లో ఉద్యోగాలు తమ జీతంపై కట్టాల్సిన ఆదాయ పన్నును ఎలా లెక్కించాలో తెలుసుకుందాం.
Income Tax Calculation Process :
- స్టెప్ 1 : మీకు వచ్చే స్థూల ఆదాయం (గ్రాస్ సాలరీ)ని లెక్కించండి. దీనిలో మీ బేసిక్ సాలరీ, అలవెన్సులు, బోనస్‌లు, పన్ను విధించదగిన ఇతర అంశాలు ఉంటాయి.
- స్టెప్ 2 : మీరు సంపాదించిన జీతంలో ఇంటి అద్దె భత్యం (HRA), లీవ్ ట్రావెల్ అలవెన్స్ (LTA) సహా, కొన్ని ప్రామాణిక అంశాలపై పన్ను మినహాయింపులు లభిస్తాయి. అందుకే వీటిని మీ గ్రాస్ సాలరీ నుంచి తీసివేయండి.
- స్టెప్ 3 : ఇన్‌కం టాక్స్ యాక్ట్, సెక్షన్ 80సీ ప్రకారం ప్రావిడెంట్ ఫండ్ (PPF), జీవిత బీమాల్లో చేసిన ఇన్వెస్ట్‌మెంట్స్‌పై పన్ను తగ్గింపులు వర్తిస్తాయి. సెక్షన్ 80డీ ప్రకారం ఆరోగ్య బీమా ప్రీమియంలపై; సెక్షన్ 24బీ ప్రకారం గృహరుణం వడ్డీలపై పన్ను తగ్గింపులు ఉంటాయి. కనుక ఈ టాక్స్ డిడక్షన్లను కూడా మీ గ్రాస్ సాలరీ నుంచి తీసివేయాలి. అప్పుడు పన్ను విధించదగిన మీ నికర ఆదాయం ఎంతో తెలుస్తుంది.
- స్టెప్ 4 : భారతదేశంలో ప్రగతిశీల పన్ను విధానాన్ని అవలంభిస్తున్నారు. దీని ప్రకారం వివిధ ఆదాయ స్లాబ్‌లను నిర్ణయించారు. ఈ స్లాబ్‌లను అనుసరించి, సంబంధిత పన్ను రేట్లను కట్టాల్సి ఉంటుంది. కనుక మీరు ఏ ఆదాయ స్లాబ్‌లోకి వస్తున్నారో చూసుకుని, అందుకు తగ్గట్టుగా ఇన్‌కం టాక్స్‌ను లెక్కించాల్సి ఉంటుంది.
- స్టెప్ 5 : మీరు పై లెక్కలన్నీ చూసుకున్న తరువాత టాక్స్ లయబిలిటీ (పన్ను బాధ్యత)ను లెక్కించాల్సి ఉంటుంది. మీరు ఏ స్లాబ్‌లోకి వస్తున్నారో చూసుకుని, అందుకు తగ్గట్టుగా ఎంత ఆదాయ పన్ను చెల్లించాలో లెక్కించాలి.
- స్టెప్ 6 : మీకు ప్రభుత్వం ఏమైనా రాయితీలు కల్పిస్తే వాటిని గ్రాస్ సాలరీ నుంచి తీసివేయాలి. అలాగే మీరు కట్టాల్సిన సర్ఛార్జీలు ఏవైనా ఉంటే వాటిని యాడ్ చేయాలి. ఉదాహరణకు మీ ఆదాయం రూ.7 లక్షలలోపు ఉంటే, సెక్షన్ 87ఏ ప్రకారం, మీకు పన్ను రాయితీ లభిస్తుంది.
- స్టెప్ 7 : మీరు కట్టాల్సిన పన్ను (టాక్స్ లయబిలిటీ)కి ఆరోగ్యం, విద్య సెస్‌లను కలపండి. (ప్రస్తుతం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ 4 శాతం వరకు ఉంది.)
- స్టెప్ 8 : పై అంశాలన్నింటినీ గణిస్తే, మీరు ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి ఎంత పన్ను చెల్లించాలో తెలుస్తుంది.
- స్టెప్ 9 : మీరు ఉద్యోగులు కనుక, మీ యజమాని ప్రతి నెలా మీ జీతం నుంచి మూలం వద్ద (TDS)ను మినహాయిస్తాడు. ఈ టీడీఎస్‌ను మీరు ప్రభుత్వానికి చెల్లించాల్సిన టాక్స్ లయబిలిటీతో సర్దుబాటు చేస్తారు. ఒక ఆర్థిక సంవత్సరంలో మీరు చెల్లించాల్సిన పన్ను రూ.10,000 దాటితే, మీరు వాయిదాల్లో ఎడ్వాన్స్ టాక్స్ చెల్లించాల్సి రావచ్చు.
- స్టెప్ 10 : చివరిగా అన్ని లెక్కలను సరిచూసుకుని, ఆదాయ పన్ను శాఖవారికి మీ ఇన్‌కం టాక్స్ రిటర్నులను (ITR)ను దాఖలు చేయండి. అందులో మీ ఆదాయం, పన్ను మినహాయింపులు, తగ్గింపులు, పన్ను చెల్లింపు వివరాలను నివేదించండి.
మీరు ఆదాయపన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్‌లోని కాలిక్యులేటర్ ఉపయోగించి, సింపుల్‌గా మీరు కట్టాల్సిన ఇన్‌కం టాక్స్‌ను లెక్కించవచ్చు. మీకు గనుక దీనిపై తగినంత అవగాహన లేకపోతే, సర్టిఫైడ్ ఫైనాన్సియల్ అడ్వైజర్‌ను సంప్రదించండి. వారు మీ ఆర్థిక పరిస్థితుల ఆధారంగా ఆదాయ పన్నులను లెక్కిస్తారు. దీనితో సింపుల్‌గా మీరు ఐటీఆర్ ఫైల్ చేయడానికి వీలవుతుంది.
బెస్ట్ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ ఎంచుకోవాలా? టాప్-7 టిప్స్ మీ కోసమే!
నయా సైబర్ స్కామ్ - ఆ నంబర్‌కు కాల్ చేశారో మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ కావడం గ్యారెంటీ!