దేశీయంగా స్మార్ట్ ఫోన్ల విపణి డీలా పడింది. అక్టోబరు-డిసెంబరులో దేశీయంగా స్మార్టఫోన్ల సరఫరాలు 27 శాతానికి పైగా తగ్గి 2.96 కోట్లకు పరిమితమయ్యాయి. 2021 ఇదే మూడు నెలల్లో 4.06 కోట్ల స్మార్ట్‌ఫోన్లు సరఫరా అయ్యాయని మార్కెట్ పరిశోధన సంస్థ ఐడీసీ పేర్కొంది. ఈసారి ద్రవ్యోల్బణ ఒత్తిళ్లే ఇందుకు కారణమని ఐడీసీ వివరించింది. చిప్‌ల సరఫరా మెరుగుపడినా, అన్ని రకాల సేవలు-వస్తువుల ధరలు పెరగడంతో, విచక్షణాధికారంతో జరిపే కొనుగోళ్లు తగ్గుతున్నాయని వివరించింది.
ముఖ్యంగా కొవిడ్ సమయంలో ఆన్‌లైన్ తరగతులు, ఇంటి నుంచి పని కోసం అత్యధికులు కొత్త స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేయడం వల్ల కూడా, ఇప్పుడు గిరాకీ పరిమితమై ఉంటుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. సామాన్య, మధ్యతరగతి వర్గాలపైనే ద్రవ్యోల్బణ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందువల్లే అందుబాటు ధర స్మార్ట్‌ఫోన్లకు గిరాకీ తగ్గింది. ఫలితంగానే వాటి సరఫరాలు తగ్గాయని చెబుతున్నారు. ద్రవ్యోల్బణ ప్రభావం అంతగా పడని సంపన్నులు కొనుగోలు చేసే ఖరీదైన స్మార్ట్‌ఫోన్ల సరఫరాలు పెరగడం ఇందుకు నిదర్శనం.
తక్కువ ధర ఫోన్లపైనే ప్రభావం: ఐడీసీ రూపొందించిన నివేదిక ప్రకారం.. రూ.25,000లోపు ధర ఫోన్ల సరఫరాలు 15% తగ్గాయి. అయితే రూ.25,000 - 41,000 శ్రేణిలోని మధ్య స్థాయి, ప్రీమియం ఫోన్ల సరఫరాలు మాత్రం 20% పెరిగాయి. రూ.41,000 పైన ధర ఉన్న ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల సరఫరాలు 55% రాణించడం విశేషం. ప్రారంభ స్థాయి అంటే రూ.12,500 లోపు ధర స్మార్ట్‌ఫోన్లు సరఫరాలు 54 శాతం నుంచి 46 శాతానికి పరిమితయ్యాయి. ఈ విభాగంలో కొత్త ఫోన్లు రాకపోవడంతో వృద్ధి పరిమితమైంది.
పెరుగుతున్న ధరలు, అదనపు నిల్వల కారణంగా 2023 ప్రథమార్ధం వరకు ఇబ్బందులు కనిపించొచ్చు. కాగా, మార్కెట్ వాటా విషయంలో డిసెంబరు త్రైమాసికంలో 18.6%, వార్షికంగా 21% వాటాతో షియోమీ అగ్రస్థానంలో ఉంది. అయితే సరఫరాలు సంఖ్యాపరంగా చూస్తే డిసెంబరు త్రైమాసికంలో 38.3%, వార్షికంగా 25% తగ్గాయి. ప్రీమియం విభాగంలో 60% మార్కెట్ వాటాతో యాపిల్ అగ్రస్థానంలో ఉండగా, శామ్‌సంగ్ 21% వాటా పొందింది.
2022 మొత్తంమీద 20.1 కోట్ల సెల్‌ఫోన్లు దేశీయ విపణిలోకి సరఫరా అయ్యాయి. 2021తో పోలిస్తే ఇవి 12% తక్కువ. ఇందులో ఫీచర్ ఫోన్లు 5.7 కోట్లు ఉన్నాయి. వీటి సరఫరాలు కూడా 18% తగ్గాయి.