జనం బాగుంటే దేశం బాగుంటుంది. దేశం బాగుంటే ఆర్థిక వ్యవస్థ పరుగులు తీస్తుంది. కానీ కరోనాతో ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ పరుగుకు అడ్డుకట్ట పడింది. అంతేకాదు.. వృద్ధి రేటు మైనస్‌లోకి దిగజారింది. ఇది జన జీవనంపై ప్రభావం చూపుతోంది. భారత ఆర్థిక వ్యవస్థ 2020-21లో స్వాతంత్య్రానంతరం ఎన్నడూ లేని స్థాయిలో ప్రతికూల వృద్ధిని (-7.3) నమోదు చేయడం ఆందోళనకు గురిచేస్తోంది. వృద్ధి రేటు తగ్గడం సామాన్యుడి జీవితాన్ని అతలాకుతలం చేసింది.
ఉదాహరణకు ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. భారతీయుడి తలసరి స్థూల జాతీయ ఆదాయం 2019-20లో రూ.1,50,320 ఉంది. ఇది నెలకు 12,527 రూపాయలు. వృద్ధి రేటు తగ్గడం వల్ల తలసరి స్థూల జాతీయ ఆదాయం 2020-21లో రూ.1,44,320కు పడిపోయింది. అంటే నెలకు రూ.12,027 అయింది. ఒకవైపు అవసరాలు, మరోవైపు ధరలు పెరుగుతున్నందున సామాన్యులపై.. ప్రత్యేకించి కూలీనాలీ చేసుకునే వారిపై పెనుభారం పడుతోంది. వారి ఆదాయాలూ తగ్గుతున్నాయి. అందుకే దేశంలో ఆరోగ్య పరిస్థితులతోపాటు ఆర్థిక పరిస్థితులను మెరుగుపర్చడం ప్రాధాన్య అంశంగా మారింది.
ఈ నేపథ్యంలో ఆర్థిక వృద్ధికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై హైదరాబాద్ యూనివర్సిటీ అర్థశాస్త్ర ఆచార్యుడు జి.ఓంకార్‌నాథ్ సూచనలతోపాటు భారత్ గతంలో లోటు వృద్ధిని ఎదుర్కొన్న సందర్భాలు, 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న లక్ష్యాన్ని చేరేందుకు ఇంకా భారత్ ఎంత దూరం ప్రయాణించాలి? అనే అంశాలపై.. సమగ్ర కథనం.
ప్రతికూల వృద్ధి లోటు.. అంటే జనజీవనం అతలాకుతలం అయినట్లే.. అన్ని రంగాల్లోనూ మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. ఉత్పత్తులు తగ్గడం వల్ల ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయి. ఉత్పత్తులు ప్రజలకు చేరే వరకూ మధ్యలో ఉండే కార్యకలాపాలపై ఆధారపడి జీవించేవారంతా దెబ్బతింటారు. ఉదాహరణకు కార్ల విక్రయాలు తగ్గితే షోరూమ్‌లు, మెకానిక్ షెడ్లు, బీమా వ్యాపారాలు తదితరాలపై జీవించేవారూ దెబ్బతింటారు.
ఆదాయాలు కోల్పోయిన వారంతా ఖర్చులను బలవంతంగా తగ్గించుకుంటారు. ఈ ప్రభావం వివిధ రకాల వ్యాపారాలపై తీవ్రంగా ఉంటుంది. ప్రతికూల వృద్ధి వల్ల ప్రధానంగా నిరుద్యోగం, దానివల్ల పేదరికం పెరుగుతాయి. ప్రభుత్వాలకు పన్నుల ద్వారా వచ్చే ఆదాయాలు తగ్గుతాయి. అభివృద్ధిపై, సంక్షేమంపై అవి పెట్టే ఖర్చు తగ్గుతుంది. ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రత్యక్ష, పరోక్ష పద్ధతుల్లో పన్నులు, సెస్సులను పెంచితే ఆ భారాన్ని ప్రజలే మోయాల్సి ఉంటుంది.
‘5 ట్రిలియన్ డాలర్ల’ మాటేమిటి?
2024-25 నాటికి భారత ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల స్థాయికి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గతంలో ప్రకటనలు చేశారు. అయిదు ట్రిలియన్ డాలర్లు అంటే 364.73 లక్షల కోట్ల రూపాయలు. వర్తమాన ధరల ప్రకారం మదింపు చేస్తే ఇది నామమాత్రం. భారత్ జీడీపీ 2020-21లో రూ.197.46 లక్షల కోట్లు ఉంది. ఇది అంతకుముందు 2019-20లో సాధించిన రూ.203.51 లక్షల కోట్లతో పోలిస్తే 3శాతం తక్కువ. 2018-19లో ఇది రూ.188.86 లక్షల కోట్లు.
అంటే రెండేళ్లలో పెరుగుదల 8.58 లక్షల కోట్లే. ఈ పరిస్థితుల్లో 2025నాటికి భారత జీడీపీ రూ.364.73 లక్షల కోట్ల స్థాయికి చేరాలంటే భారత్ గతేడాదితో పోలిస్తే అదనంగా నాలుగేళ్లలో రూ.167.27 లక్షల కోట్ల జీడీపీ స్థాయిని సంతరించుకోవాల్సి ఉంటుంది. దీని కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి ఏటా దాదాపు 17 శాతం వృద్ధి సాధించాలి. అందుకే ఇది అసాధ్యమైన లక్ష్యమని, దీన్ని ఇప్పట్లో చేరుకోలేమని రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రంగరాజన్ వంటివారు చెబుతున్నారు.
ప్రతికూల వృద్ధి ఎందుకంటే..
స్వాతంత్య్రానంతరం గత ఆర్థిక సంవత్సరానికంటే ముందు 1979-80లో భారత్ అతి పేలవంగా ప్రతికూల వృద్ధిని (-5.2) నమోదు చేసింది. దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో నెలకొన్న తీవ్రమైన కరవు దీనికి ఒక కారణం. ఇరాన్‌లో రాచరికానికి వ్యతిరేకంగా జరిగిన విప్లవం వల్ల భారత్‌కు ముడిచమురు సరఫరాలో తీవ్ర అంతరాయాలు ఏర్పడ్డాయి. దీంతో ఆ ఏడాది ఇంధన ధరలు దేశంలో రెట్టింపయ్యాయి. దేశానికి 1979లో కొంతకాలం మొరార్జీదేశాయ్, మరి కొంతకాలం చరణ్‌సింగ్ ప్రధానులుగా ఉన్నారు. 1980 జనవరిలో ఇందిర ప్రధాని అయ్యారు. 1979లో దేశంలో నెలకొన్న అస్థిర రాజకీయ పరిస్థితుల వల్ల కూడా కేంద్రం ఆర్థిక రంగాన్ని మెరుగుపర్చే చర్యలను తీసుకోలేకపోయిందనే విమర్శలున్నాయి.
జీడీపీని ఎలా లెక్కిస్తారు?
దేశ ఆర్థిక వ్యవస్థ ఒక సంవత్సరంలో ఉత్పత్తి చేసిన సరకులు, సేవల నికర విలువను జీవీఏ (గ్రాస్‌వాల్యు యాడెడ్) అంటారు. ఉత్పత్తికి ఉపయోగించిన ముడిపదార్థాల విలువను సరకుల, సేవల మొత్తం విలువ నుంచి మినహాయించాక ఇది తేలుతుంది. ఈ జీవీఏకు అన్ని ఉత్పత్తులకు సంబంధించిన పన్నులను కలుపుతారు. ఆ ఉత్పత్తులకు సంబంధించి ఇచ్చే సబ్సిడీలను మినహాయిస్తారు. అలా తేలే మొత్తమే జీడీపీ.
- ఉపాధి కల్పనకు కొత్త పథకం అవసరం దేశ ఆర్థిక పరిస్థితులపై ఈటీవీ భారత్’తో హెచ్‌సీయూ అర్థశాస్త్ర ఆచార్యులు జి.ఓంకార్‌నాథ్
ప్రస్తుత ఆర్థిక సంక్షోభం ఆర్థికేతర కారణం వల్ల అంటే కరోనాతో వచ్చింది. రెండో వేవ్‌ను మనం నిర్లక్ష్యం చేయడం వల్ల సమస్య ముదిరింది. ఇప్పుడు ప్రజల ప్రాణాలను కాపాడటానికి అత్యంత ప్రాధాన్యమివ్వాలి. వ్యాక్సినేషన్‌ను వేగవంతô చేయాలి. ప్రభుత్వ రంగంలో ఆరోగ్య మౌలిక వసతులను యుద్ధప్రాతిపదికన పెంచాలి. ఉద్దీపనకంటే ఈ చర్యలే కీలకం. ఇవి సమర్థంగా జరిగిన దేశాల్లో సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
ప్రజా సంక్షేమం పేరుతో ఓట్ల కోసం ప్రజలను యాచకులుగా మార్చేలా ప్రభుత్వాలు కొన్ని పథకాలను అమలు చేస్తున్నాయి. వాటికి బదులు ప్రజలకు అవసరమైన నైపుణ్యాలు నేర్పించి చిన్నతరహా పరిశ్రమలను పెట్టిస్తే ఆర్థిక వ్యవస్థలో పలు మార్పులు వస్తాయి. కొబ్బరిచెట్టు ఆధారంగా 16 రకాల పరిశ్రమలను పెట్టవచ్చు. అలాగే మామిడి ఆధారంగా ఎన్నో పరిశ్రమలను పెట్టవచ్చు. మనం మండలాల పేరుతో స్థానిక సంస్థలను వికేంద్రీకరించినా స్థానికంగా ఇలాంటి ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చేవిగా వాటిని మార్చలేకపోయాం. ఇప్పటికైనా ఈ అంశంపై దృష్టి పెట్టాలి.-- అర్థశాస్త్ర ఆచార్యులు జి.ఓంకార్‌నాథ్
కరోనా పరిస్థితుల వల్ల జీవనం కోల్పోయిన కోట్లాది మందికి ఉపాధి కల్పించేందుకు కేంద్రం ఒక కొత్త పథకాన్ని తేవాలని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (హెచ్‌సీయూ) అర్థశాస్త్ర ఆచార్యులు జి.ఓంకార్‌నాథ్ అన్నారు. ఇది ప్రస్తుత గ్రామీణ ఉపాధిహామీ పథకానికి అదనంగా, దానికంటే భిన్నంగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. జీడీపీ వృద్ధి క్షీణించిన నేపథ్యంలో పరిస్థితులను మెరుగుపర్చేందుకు ఏం చేయాలనే అంశంపై ‘ఈటీవీ భారత్’తో ఆయన మాట్లాడారు. ప్రస్తుత ఉపాధి హామీ పథకాన్ని గ్రామాల్లో వ్యవసాయ కార్మికులు, చిన్న రైతులకు వేసవిలో పొలం పనులు లేనప్పుడు కొంత ఆదాయాన్ని సమకూర్చేందుకు రూపొందించారని వివరించారు.
కొత్త పథకాన్ని ప్రజలకు బాగా ఉపయోగపడే ఆసుపత్రులు, పాఠశాలలు, మంచినీటి సౌకర్యాలు తదితర శాశ్వత పనులను చేపట్టేలా యుద్ధప్రాతిపదికన అమలు చేయాలన్నారు. నైపుణ్య కార్మికులకూ దీని ద్వారా పని కల్పించవచ్చని వివరించారు. దీన్ని పట్టణాల్లోనూ అమలు చేయాలని సూచించారు. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని అభిప్రాయపడ్డారు. ఈ పథకం కింద చేపట్టిన పనుల్లో భాగస్వామ్యం వహించే నైపుణ్యం లేనివారు మిగిలితే వారికి నగదు సాయం చేయవచ్చని వివరించారు. ఆయన వ్యక్తం చేసిన మరికొన్ని అభిప్రాయాలు ఆయన మాటల్లోనే..
* ప్రజలకు బదిలీ కోసం, ఇతర ఉపశమన చర్యలకు అవసరమైతే నగదు అదనంగా ముద్రించాలని కొందరు చేస్తున్న వాదనను నేను సమర్థించను. రిజర్వు బ్యాంకు వద్ద మిగులు నిధులు బాగా ఉన్నాయి. ఇంకా అవసరమైతే బ్యాంకులకు బాండ్ల జారీ ద్వారా అది నిధులు సేకరించగలదు. ప్రస్తుతం విదేశీ మారక ద్రవ్యం, ఆహారధాన్యాలు సరిపడా నిల్వలున్నాయి. ఆహారధాన్యాలు అవసరమైన ప్రతి వారికి రేషన్‌కార్డు ప్రమేయం లేకుండా సరిపడా ఉచితంగా ఇవ్వాలి.
* కేంద్రం రాష్ట్రాలకు నిధుల కేటాయింపు పెంచాలి. ప్రజలకు వైద్యాన్ని రాష్ట్రాలే అందిస్తున్నాయి. వ్యాక్సిన్ల భారాన్ని కొంత మోస్తున్నాయి. ఇటీవల రిజర్వుబ్యాంకు ద్వారా అందిన నిధుల్లోనూ ఎక్కువ భాగం రాష్ట్రాలకే ఇవ్వాలి.
* స్వాతంత్య్రం వచ్చిన కాలంలో జాతీయ ఆదాయంలో 70శాతం వ్యవసాయం ద్వారా సమకూరేది. ఇప్పుడది సుమారు 15 నుంచి 20 శాతమే. ఇప్పటికీ సగం జనాభా వ్యవసాయంపైనే ఆధారపడి ఉంది. దీంతో వారి ఆదాయాలు తక్కువ. మరో 25 శాతం జనాభాను వ్యవసాయం నుంచి పరిశ్రమలు, సేవా రంగాల వైపు మళ్లించాలి. అప్పుడు మొత్తం జనాభా కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఫలితంగా ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతుంది. ఉత్పత్తి ఎక్కువ స్థాయిలో జరిగితే వ్యయాలు తగ్గి ఎగుమతుల మార్కెట్‌లోనూ పోటీపడగలం.
ఇదీ చదవండి: