భారత పారిశ్రామిక దిగ్గజం ముఖేశ్ అంబానీ అరుదైన ఘనత సాధించారు. సంపన్నుల జాబితాలో అపర దానకర్ణుడిగా పేరుగాంచిన వారెన్ బఫెట్‌ను వెనక్కినెట్టారు. బ్లూమ్‌బర్గ్ సంపన్నుల సూచీ ప్రకారం ప్రపంచ కుబేరుల్లో ఎనిమిదో స్థానానికి చేరుకున్నారు. ఆసియా నుంచి టాప్-10లో ఉన్న ఒకే ఒక్కరు ముఖేశ్ కావడం గమనార్హం.
రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను రుణరహిత సంస్థగా మార్చాలని కంకణం కట్టుకున్న ముఖేశ్ అంబానీ.. ఆ పనిలో విజయవంతమయ్యారు. ప్రస్తుతం ఆ సంస్థ విలువ 68.3 బిలియన్ డాలర్లకు చేరుకుంది. బఫెట్ సంస్థ బెర్క్‌షైర్ హాథవే 67.9 బిలియన్ డాలర్లను దాటేసింది. ఐతే 2.9 బిలియన్ డాలర్లను విరాళంగా ఇవ్వడం, సంస్థ పనితీరు కాస్త మందగించడం వల్ల బఫెట్ తొమ్మిదో స్థానానికి దిగిపోయారు. 2006లోనూ 37 బిలియన్ డాలర్లను విరాళంగా ఇవ్వడం వల్ల ఆయన ర్యాంకు తగ్గింది.
ఈ ఏడాది రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ విభాగంలో ఫేస్‌బుక్, సిల్వర్ లేక్ సహా కొన్ని కంపెనీలు 15 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టాయి. రిలయన్స్ చమురు రిటైల్ వ్యాపారంలో బీపీ పీఎల్‌సీ బిలియన్ డాలర్ల వాటా కొనుగోలు చేసింది. మొత్తంగా 2020లో ఎంఅండ్‌ఏ ద్వారా 12శాతానికి పైగా ఒప్పందాలు కుదుర్చుకున్నారు.