రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కుమార్తె, జియో ఏర్పాటుకు ప్రధాన కారకురాలు ఈశా అంబానీకి(Isha Ambani news) అరుదైన గౌరవం దక్కింది. వాషింగ్టన్‌లోని 'స్మిత్సోనియన్స్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఏషియన్ ఆర్ట్' ట్రస్ట్ బోర్డు(smithsonian's national museum board) సభ్యురాలిగా నియమితులయ్యారు.
నేషనల్ మ్యూజియం ఆఫ్ ఏషియన్ ఆర్ట్ బోర్డుకు ఎంపికైన అత్యంత పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందారు ఈశా. నాలుగేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.
మరో ఇద్దరు..
ఈశా అంబానీ నియామకాన్ని స్మిత్సోనియన్ బోర్డు(smithsonian's national museum board) ప్రతినిధులు ఆమోదించారు. ఆమెతో పాటు కరోలిన్ బ్రేమ్, పీటర్ కిమ్మెల్మాన్ ఈ బోర్డు సభ్యులుగా ఎంపికయ్యారు. వీరి నియామకం సెప్టెంబర్ 23 నుంచి అమలులోకి వచ్చిందని, నాలుగేళ్ల పాటు ఈ పదవుల్లో కొనసాగనున్నారని మ్యూజియం ఓ ప్రకటనలో తెలిపింది.
17 మంది సభ్యులతో కూడిన ప్రతినిధుల బోర్డులో అమెరికా ప్రధాన న్యాయమూర్తి, ఉపాధ్యక్షుడు, ముగ్గురు సెనేటర్లు, ముగ్గురు ప్రతినిధుల సభ సభ్యులు, తొమ్మిది మంది పౌరులు ఉంటారు. స్మిత్సోనియన్ పరిపాలన బాధ్యతలు ఈ బోర్డు చూస్తుంది. స్నిత్సోనియన్ తొలి ఆర్ట్ మ్యూజియం ఇదే. దీనిని 1923లో ప్రారంభించారు.
ఇదీ చూడండి: ఆనంద్‌లో నాకు నాన్న ముకేశ్ అంబానీ కనిపిస్తారు...