భాజపా, వైకాపాపై మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. కేంద్రం విడుదల చేసిన నిధులకు ఏపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని భాజపా నేతలు అనడం హాస్యాస్పదమన్నారు. ఐదేళ్లలో వాళ్లిచ్చిన 13వేల కోట్ల రూపాయలకు ఏం సమాధానం చెప్పాలని యనమల ప్రశ్నించారు. ఏడాదికి 2వేల 5వందల కోట్లు కూడా ఇవ్వని వారికి సమాధానం కావాలా అంటూ నిలదీశారు. పోలవరానికి ఇవ్వాల్సిన 4వేల కోట్ల రూపాయల నిధుల విడుదలలో ఎందుకు జాప్యం చేస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు.
ఎన్నికల ముందు తలలేని మొండెంలాంటి రైల్వే జోన్ ఇచ్చి... 7వేల కోట్ల రూపాయల రాబడి నష్టం చేశారని మండిపడ్డారు. 16వేల కోట్ల రూపాయల ఆర్థిక లోటులో పావలా కూడా ఇవ్వని భాజపాకు... తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కేసీఆర్తో కలిస్తే తప్పేంటన్న జగన్ వ్యాఖ్యలతో... వైకాపా, తెరాస మధ్య రహస్య బంధం బయటపడిందన్నారు.కేసుల కోసం నరేంద్రమోదీతో జగన్ లాలూచీ ఒక వైఫల్యమని... ఆస్తులు కాపాడుకోవడానికి కేసీఆర్తో కుమ్మక్కు మరో వైఫల్యమన్నారు. భాజపా, తెరాసతో చేతులు కలిపిన జగన్‌కు రాష్ట్ర ప్రజలే బుద్ధి చెబుతారని యనమల రామకృష్ణుడు చెప్పారు.