ఏటా వేసవిలో కూరగాయల ధరలు పెరగడం సాధారణమే అయినా... ఈ ఏడాది ధరలు అందనంత ఎత్తులో ఉన్నాయి. మిర్చి, టమాట, క్యాప్సికం, క్యారెట్, బీట్రూట్ ధరల గురించి చెప్పనక్కర్లేదు. కిలో మిర్చి ధర రైతుబజార్లలో 60 రూపాయలు ఉండగా... టమాట 45 రూపాయలకు చేరింది. అల్లం ధర 156 రూపాయల పైమాటే. క్యారెట్-52, బీట్ రూట్-38, క్యాప్సికం-46 రూపాయలకు పెరిగాయి. గోరుచిక్కుడు, కొత్తిమీర, కరివేపాకు ధరలు గరిష్ఠస్థాయికి చేరాయి.
రైతుబజార్లలో రేట్లు ఇలా ఉంటే... మార్కెట్లో ధరలు మండుతున్నాయి. గుంటూరు జిల్లా రాజధానిగా మారడంతో... వలసలు పెరిగి పరోక్షంగా కూరగాయలకు డిమాండ్ మరింత పెరిగింది. జిల్లాలో కూరగాయల సాగు విస్తీర్ణం తగ్గడం ప్రభావం చూపుతోంది. డిమాండ్‌కు తగ్గట్లు సాగు పెంచుతామని ఉద్యాన అధికారులు చెబుతున్నా... ఆచరణలోకి రావడం లేదు. ఫలితంగా... కొనలేక... వెనుదిరిగి వెళ్లలేక వినియోగదారులు సతమతమవుతున్నారు.
ప్రస్తుతం కూరగాయల పంటకు నీరందించలేక రైతులు తంటాలుపడుతున్నారు. వర్షాలు పడితే తప్ప పరిస్థితి కుదటపడే అవకాశం లేదని అన్నదాతలు చెబుతున్నారు.
ఇవీ చూడండి : అందాల కైలాసగిరి.. ఆనందాల లోగిలి