విజయవాడ-మచిలీపట్నం ప్యాసింజర్ రైలుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్తోన్న ప్యాసింజర్ రైలు వడ్లమానాడు వద్ద పట్టాలు తప్పింది. ఇవాళ సాయంత్రం 4 గంటల సమయంలో గుడ్లవల్లేరు మండలం వడ్లమానాడు వద్దకు రాగానే పట్టాలపైకి అకస్మాత్తుగా వచ్చిన గేదెను రైలు ఢీకొట్టింది.
వేగంగా వచ్చిన రైలు గేదెను ఢీకొట్టడం వలన రైలు చివరి భాగంలో ఉన్న 4 బోగీలు పట్టాలు తప్పాయి. వేగం నియంత్రించడం వలన ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అప్రమత్తమైన రైల్వే అధికారులు సహాయ చర్యలకు దిగారు. ఈ మార్గం సింగిల్ రైల్వే లైన్ కావడం వలన విజయవాడ-మచిలీపట్నం మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. బోగీలు తిరిగి పట్టాలపై ఎక్కించేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు.