ఫార్మింగ్టన్ యూనివర్సిటీ వ్యవహారంలో అమెరికా అధికారుల అదుపులో ఉన్న తెలుగు రాష్ట్రాల విద్యార్థుల్లో ఎనిమిది మందికి ఊరట లభించింది. స్వచ్ఛందంగా స్వదేశానికి వెళ్లేందుకు మిచెగావ్ న్యాయస్థానం అనుమతిచ్చింది. ఈ నెల 26లోగా అమెరికా విడిచి వెళ్లాలని ఆదేశించింది. ఆ 8 మందిని భారత్ కు పంపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు అమెరికా తెలుగు అసోసియేషన్.. ఆటా తెలిపింది. బాధిత విద్యార్థులకు మద్దతుగా నిలవాలని అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి ఎలిసా స్లాటికిన్ ను ఆటా ప్రతినిధులు కోరారు. విద్యార్థులకు నేరం చేసే ఉద్దేశం లేదని.. వారు పొరపాటున ఫార్మింగ్టన్ యూనివర్సిటీలో చేరినట్లు తెలుస్తోందని ఎలిసా చెప్పారు. వారు స్వదేశానికి వెళ్లేలా సహకరిస్తామన్నారు.
ఫార్మింగ్టన్ యూనివర్సిటీ వ్యవహారంలో చిక్కుకున్న 120 మంది విద్యార్థులు వివిధ ప్రాంతాల్లోని డిటెన్షన్ కేంద్రాల్లో ఉన్నారు. కేలహోన్, మన్రో కౌంటీ డిటెన్షన్ కేంద్రాల్లో ఉన్న 20 మంది విద్యార్థులకు సంబంధించిన విచారణ పూర్తయింది. వారిలో ఇద్దరు భారతీయులు, ఒక పాలస్తీనా విద్యార్థికి స్వచ్చందంగా వెళ్లిపోవడానికి ఇప్పటికే అనుమతి లభించింది. మిగతా 17 మందిలో 8 మంది తెలుగు విద్యార్థులు సహా 15మందికి ఇవాళ కోర్టు స్వదేశానికి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఒక విద్యార్థిని దేశం నుంచి బహిష్కరిస్తూ.. త్వరగా పంపించాల్సిందిగా అమెరికా ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. మరో విద్యార్థి అమెరికాకు చెందిన వ్యక్తినే పెళ్లి చేసుకున్నందున.. బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు.