యువత సాధికారిత ప్రధానాంశంగా ప్రత్యేక విధానానికి రూపకల్పనను మేనిఫెస్టోలో చేర్చబోతున్నారు. తెలుగుదేశం ఎన్నికల మేనిఫెస్టోను ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఇవాళ ఆవిష్కరించనున్నారు.
ఎన్నికల మేనిఫెస్టోను అన్ని వర్గాలను ఆకట్టుకునేలా..జనరంజకంగా ఉండేలా వివిధ అంశాలతో రూపొందించడం అధికార పార్టీకి సవాల్ మారింది. కొత్త పథకాలు, హామీలు, భరోసా అన్ని కలగలిపిన మేనిఫెస్టోనుతెదేపా తయారుచేస్తోంది. ఐదేళ్ల కాలంలో సాధ్యపడే హామీలనే ప్రస్తావించే విధంగా సమతూల్యం ఆకర్షణ హామీ పత్రాన్నిరూపొందిస్తున్నారు.
సంక్షేమ పథకాలు కొనసాగింపు
2019 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధానంగా ప్రస్తుతం రాష్ట్రంలో అమలుచేస్తోన్న పథకాలు, సాధించిన అభివృద్ధి, ప్రతి కుటుంబానికి చేకూరే లబ్ది అనే అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఇప్పటికే ప్రకటించిన పలు కీలక సంక్షేమ పథకాల ద్వారా లబ్దిదారుల ఖాతాల్లో నగదు వేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ పథకాల కొనసాగింపుతోపాటు కొత్తవాటిని చేర్చే ఆలోచనలు చేస్తున్నారు.
మహిళలు, యువత, రైతులు, బీసీ, ఎస్సీ వర్గాల కోసం కొత్త కార్యక్రమాలు రూపకల్పన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అభివృద్ధితోపాటు సంక్షేమ రంగంపై దృష్టి సారించాలని తెదేపా అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. ముఖ్యంగా కాపుల రిజర్వేషన్లు, వివిధ వర్గాలకు కార్పొరేషన్లు ఏర్పాటు తెదేపా చేస్తున్న ప్రయత్నాలకు ఊతం ఇచ్చే లక్ష్యంగా మేనిఫెస్టో రూపొందిస్తున్నారు.
జనాకర్ష పథకాలు
ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన మేనిఫెస్టో కమిటీ పలుమార్లు సమావేశమైంది. మేనిఫెస్టో రూపకల్పనకు వచ్చిన ప్రతిపాదనలన్నింటినీ పరిశీలించింది. చంద్రన్న పెళ్లికానుక, కొత్త జంట కాపురానికి అవసరమైన ఇంటి స్థలం లేదా ఇల్లు మంజూరు పత్రాలు, ఉచిత గ్యాస్ కనెక్షన్ వంటివన్నీ పెళ్లిపీటల మీదే అందజేసేలా జనాకర్షక పథకాలను మేనిఫెస్టోలో ప్రకటించే అవకాశం ఉంది. రైతులకు అందిస్తోన్న 9 గంటల ఉచిత విద్యుత్‌ను 12 గంటలకు పెంచే యోచనలో తెలుగుదేశం ఉంది. ఇదే అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని భావిస్తోంది.
రంగాల వారీగా అనేక ప్రతిపాదనలను యనమల కమిటీ సిద్ధం చేసింది. పార్టీ అధినేత చంద్రబాబు ఆమోదంతో తుదిమెరుగులు దిద్దే పనిలోపడ్డారు. ఈరోజు అమరావతి ప్రజావేదికలో చంద్రబాబు లాంఛనంగా ప్రకటించనున్నారు.
ప్రజామోదం కోసం
2023తో ముగియనున్న ఎస్సీ ఉపప్రణాళిక కాలపరిమితిని మరో 10ఏళ్లు పొడిగించే అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చనున్నట్లు తెలస్తుంది. కుటుంబ వికాసం కోసం మేనిఫెస్టోలో 15 అంశాలు, సమాజ వికాసం కోసం 10 అంశాలు చేర్చే అవకాశం ఉంది. జీఎస్‌డీపీ రూ.24 లక్షల కోట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కమిటీ తెలిపింది.
ప్రజాభిప్రాయం తెలుసుకోడానికి తెదేపా www.tdpmanifesto.com వెబ్‌సైట్ ప్రారంభించింది. ఈసైట్ ద్వారా తెలుసుకున్న ప్రజల అభిప్రాయాలను మేనిఫెస్టోలో పొందుపరచారు. ఇతర పార్టీల్లా కాకుండా ప్రజాభిప్రాయం ప్రకారం మేనిఫెస్టో తయారుచేసినట్లు తెదేపా వర్గాలు చేప్తున్నాయి.
యువతకో కార్పొరేషన్
యువజనాభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేయాలని లోకేశ్ నేతృత్వంలో కమిటీ సిఫార్సుచేసింది. ప్రతి ప్రభుత్వ కళాశాలలోను ఉచిత వైఫై, పార్టీ కమిటీల్లో యువతకు పదవులు, వివిధ రంగాల్లో ఘనవిజయాలు సాధించిన యువతకు పురస్కారాలు, కెరీర్ గైడెన్స్, కౌన్సెలింగ్ కేంద్రాలు, గిరిజనులకు ఉచితంగా వ్యవసాయ ఉపకరణాలు వంటివి మేనిఫెస్టోలో పొందుపరుస్తున్నట్లు తెలుస్తోంది.
లబ్ధిఇలా..!
వ్యవసాయాన్ని లాభసాటిగా తీర్చిదిద్దేందుకు అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలుకు మరింత సమర్థంగా పనిచేసేలా మేనిఫెస్టోలో విధివిధానాలు చేర్చారు. గిరిజనుల్ని వ్యవసాయం వైపు ఆకర్షించేందుకు ఉచితంగా విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ ఉపకరణాలు అందజేయడం, పంట ఉత్పత్తులకు మద్దతు ధర, సకాలంలో కొనుగోలు చర్యలు,మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం విస్తృతం చేయడం, బియ్యం ఆధారిత ఆహారశుద్ధి యూనిట్లకు అధిక ప్రాధాన్యత అంశాలు చేర్చనున్నారు. చిరుధాన్యాలు, వేరుసెనగ నుంచి ఆహారోత్పత్తులు తయారుచేసే పరిశ్రమల్ని ప్రోత్సహించడం ద్వారా ఆ పంటలకు మార్కెట్‌లో మెరుగైన ధరలు లభించేలా చర్యలు చేపట్టే విధానాలు ప్రకటించనున్నారు.
ఇచ్ఛాపురం-తడ తీరప్రాంతంలో ప్రతి50 నుంచి 100 కి.మీ.లకు ఫిషింగ్ జెట్టీల నిర్మాణంపై హామీ ఇవ్వనున్నారు. తుపాను సమయాల్లో మత్స్యకారులకు వేగంగా ఒడ్డుకు చేరుకునేలా ఏర్పాటు చేసే విధానం, డ్వాక్రా మహిళలకు ఆర్థిక సాయం అందించే పసుపు-కుంకుమ పథకం కొనసాగింపు,బీసీ యువతకు రాయితీపై వాహనాలు, ప్రతి మండలానికి ఒక రెసిడెన్షియల్ స్కూలు, దళితతేజం, నారా హమారా సభల్లో ఇచ్చిన హామీలు మేనిఫెస్టోలో చేర్చనున్నారు.
చెరువుల పునరుద్ధరణ, నదుల అనుసంధానం చేపట్టే భారీ ప్రణాళికలను రూపొందించనున్నారు. మొత్తంగా అన్ని వర్గాలను సంతృప్తి పరిచేలా..ఆర్థిక సమీకరణాలు బేరీజు వేసుకుని ప్రజాకర్ష మేనిఫెస్టోను అధినేత చంద్రబాబు ఆవిష్కరించనున్నారు.
ఇవీ చూడండి