వేసవి సెలవులు ముగుస్తున్నాయి. పాఠశాలల పునఃప్రారంభం దగ్గర పడింది. విద్యాసంవత్సరం ప్రారంభంలో విద్యార్థులకు అందించే నూతన పుస్తకాలు ఆయా మండల విద్యాశాఖ కార్యాలయాల్లో సిద్ధంగా ఉన్నాయి. పుస్తకాలను పాఠశాలలకు తరలించేందుకు ఏపీఎస్ఆర్టీసీ టెండర్ పొందింది. ఆర్టీసీ గూడ్స్ వాహనాల్లో పుస్తకాలను తరలించేందుకు ఒక్కో పుస్తకానికి 30 పైసలు చొప్పున విద్యాశాఖ ఆర్టీసీకి చెల్లిస్తోంది. పుస్తకాల సరఫరాకు ఆర్టీసీ సిబ్బందికి బదులు విద్యార్థులనే కూలీలుగా వినియోగిస్తున్నారు కొందరు అధికారులు.
కృష్ణా జిల్లా అవనిగడ్డ మండల విద్యాశాఖ కార్యాలయంలో ఉన్న సుమారు 10 వేల పుస్తకాలను మండలంలోని ప్రభుత్వ పాఠశాలలకు తరలించేందుకు విద్యార్థులనే కూలీలుగా మార్చేశారు. మండుటెండల్లో విద్యార్థులతో పుస్తకాల సరఫరా చేయిస్తున్నారు. ఆర్టీసీ గూడ్స్ వాహనంలో తరలిస్తున్న వేలాది పుస్తకాలను విద్యార్థుల చేత మోయిస్తున్నారు.
విద్యార్థులను కూలీలుగా మార్చి పుస్తకాలు మోయించడమేంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఉక్కపోతలో..గాలి ఆడని గూడ్స్ వాహనంలో విద్యార్థులకు ప్రమాదం జరిగితే పరిస్థితి ఏమిటని అధికారులను నిలదీశారు.
ఇవీ చూడండి : వైకాపా తొలి హామీ... వైఎస్సార్ పింఛన్ జీవో జారీ