పశ్చిమ్ బంగలో జరిగిన శారదా కుంభకోణం, పోంజీ స్కీంపై సీబీఐ విచారణకు హాజరయ్యారు కోల్కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్. గత ఆదివారం పశ్చిమ బంగలో జరిగిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది సీబీఐ. దర్యాప్తు సంస్థ విచారణకు హాజరు కావల్సిందేనని సీపీని ఆదేశించింది న్యాయస్థానం. దీంతో షిల్లాంగ్లో విచారణకు హాజరయ్యారు రాజీవ్ కుమార్.
కునాల్ ఘోష్కూ సమన్లు
కేసు విచారణలో భాగంగా తృణమూల్ కాంగ్రెస్ బహిష్కృత నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు కునాల్ ఘోష్ కూడా షిల్లాంగ్ కార్యాలయంలో హాజరు కావల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు సీబీఐ అధికారులు.
2013లో జరిగిన శారదా కుంభకోణంలో రూ.10 వేల కోట్ల వరకు తారుమారయ్యాయి. ప్రధాన నిందితులు సుదీప్త సేన్, దేబ్జనీ ముఖర్జీలను 2013లో కశ్మీర్లో అదుపులోకి తీసుకున్నారు. బంగాల్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి నేతృత్వం వహిస్తున్న కోల్కతా ప్రస్తుత కమిషనర్ రాజీవ్ కుమార్ పలు కీలక దస్త్రాలు మాయం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.