పుల్వామా ఉగ్రదాడిపై చైనా తీవ్ర విచారం వ్యక్తం చేసింది. కానీ ఐక్యరాజ్య సమితి నిషేధించిన పాకిస్థాన్ ఆధారిత తీవ్రవాద సంస్థ జైషే మహ్మద్ అధినేత మసూద్ అజర్‌ను అంతర్జాతీయ తీవ్రవాదిగా గుర్తించాలన్న భారత వినతిని మాత్రం మరోమారు తోసిపుచ్చింది.
1267 భద్రతా మండలి కమిటీ ద్వారా అజర్‌ను అంతర్జాతీయ తీవ్రవాదిగా గుర్తించాలని భారత్, అమెరికా, యూకే, ఫ్రాన్స్ ప్రతిపాదించాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ప్రతిపాదనలను తిరస్కరించే అధికారం కలిగిన సభ్యుల్లో చైనా ఒకటి. అలాగే పాకిస్థాన్‌తో మంచి సంబంధం కలిగి ఉంది. భారత డిమాండ్‌ను నేరుగా తిరస్కరించకుండా... దొడ్డిదారి అనుసరించింది చైనా. జైషే మహ్మద్ ఇప్పటికే ఐక్యరాజ్యసమితి కమిటీ ఆంక్షల జాబితాలో ఉందంటూ అజర్‌పై చర్యల ప్రతిపాదనను తోసిపుచ్చింది.
"తీవ్రవాద దాడిపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాం. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తున్నాం. ఉగ్రవాద సంస్థల జాబితాపై 1267 భద్రతా మండలి కమిటీలో తీవ్రవాద సంస్థలపై స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. జెమ్ తీవ్రవాద ఆంక్షల జాబితాలో ఉంది. నిర్మాణాత్మక, బాధ్యతాయుతమైన పద్ధతిలో ఆంక్షలను చైనా కొనసాగిస్తుంది. "
- జెంగ్ షుయాంగ్, చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి
ఒకవేళ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి కమిటీ అజర్‌ను అంతర్జాతీయ తీవ్రవాదిగా గుర్తిస్తే ప్రంపంచ వ్యాప్తంగా ప్రయాణాలు చేయటంపై నిషేధం ఉంటుంది. అతని ఆస్తులను స్తంభింపజేస్తారు.