రాష్ట్రంలో పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్.... బ్యాలెట్ విధానంలో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాల కృష్ణ ద్వివేది తెలిపారు. ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పట్టభద్రుల స్థానానికి ఒక చోట 40 మంది, మరో చోట 44 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారని ఇందుకోసం పెద్ద బ్యాలెట్ పేపర్ సిద్ధం చేశామని వివరించారు.
3 ఎమ్మెల్సీ స్థానాలకు 94 నామినేషన్లు
మొత్తం 3 ఎమ్మెల్సీ స్థానాలకు 94 నామినేషన్లు దాఖలు అయ్యాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాల కృష్ణ ద్వివేది వెల్లడించారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు.
కృష్ణా జిల్లాలో 166, గుంటూరు 176, తూర్పుగోదావరి 166, పశ్చిమగోదావరి 133 చొప్పున కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గంలో 2 లక్షల 44వేల 635 మంది, తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లా పట్టభద్రుల నియోజకవర్గంలో 2 లక్షల 90వేల 780 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారని ద్వివేది స్పష్టం చేశారు.
'మై ఓట్ క్యూ యాప్'
పోలింగ్ కేంద్రాల్లో రద్దీ వివరాలు తెలుసుకునేందుకు "మై ఓట్ క్యూ " యాప్ ను విడుదల చేస్తున్నామని, ప్రయోగాత్మకంగా ఈ సారి పరీక్షించనున్నట్లు తెలిపారు.