అడవుల్లో ఉండాల్సిన జంతువులు ఆకలిదప్పులు తీర్చుకునేందుకు గ్రామాల్లోకి వచ్చి ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. కడప జిల్లా బద్వేలు మండలం బయనపల్లిలో ఎలుగుబంటి కలకలం సృష్టించింది. వరుణుడు ఐదేళ్లుగా ముఖం చాటేస్తున్నందున అడవి జంతువుల పరిస్థితి దయనీయంగా మారింది. నీరు, ఆహారం కొరతతో గ్రామాల్లోకి వస్తున్నాయి. దీంతో ప్రజల్లో భయం నెలకొంది. లంకమల అభయారణ్యం నుంచి వచ్చిన ఎలుగుబంటి తెల్లవారుజాము 6 గంటలకు మొదట శ్రీనివాసపురంలో కనిపించింది. గ్రామస్తులు భయపడి దాన్ని బయటకు పంపే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి బయనపల్లి గ్రామానికి చేరింది. గ్రామంలోని ముళ్లపొదల్లో దాక్కొని నాలుగు గంటలపాటు అక్కడే నిలిచిపోయింది. గ్రామస్తులు చుట్టుముట్టడంతో దాడికి ప్రయత్నం చేసింది. గాయపడకుండా తప్పించుకున్న గ్రామస్తులు విషయాన్ని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. బద్వేల్ రేంజర్ సుభాష్ సిబ్బందితో గ్రామంలోకి చేరుకున్నారు. అటవీ ప్రాంతం వైపు పంపే ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు అడవి ప్రాంతంలోకి వెళ్లిపోవడంతో అధికారులు బద్వేలుకు వెనుదిరిగారు.
ఇదీ చదవండీ :