ఎన్నికల తేదీలు ఖరారు కావడంతో ప్రధాన పార్టీలకు వలసలు జోరందుకున్నాయి. వైకాపా అధినేత వైఎస్ జగన్ నివాసానికి నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున వస్తున్నారు. లోటస్‌పాండ్‌లో రేపు జగన్ సమక్షంలో పలువురు నేతలు చేరనున్నారు. మాగుంట శ్రీనివాసులురెడ్డి, తోట నరసింహం, పీవీపీ లు వైకాపాలో చేరనున్నారు.
పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ)..
ప్రముఖ పారిశ్రామికవేత్తపొట్లూరి వరప్రసాద్ (పీవీపీ)రేపు వైకాపా అధినేత జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నారు. విజయవాడ లోక్ సభ స్థానానికి వైకాపా అభ్యర్థిగా పీవీపీ పోటీ చేసే అవకాశం ఉంది. ఈ నెల 23న ఆయన నామినేషన్ వేస్తారని ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లోనే వైకాపా తరపున పీవీపీ విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నించారు. అయితే అప్పట్లో ఆయనకు సీటు దక్కలేదు. ఈ సారి కూడా ఆయన విజయవాడ నుంచే బరిలోకి దిగేందుకు ఆసక్తి చూపడంతోవైకాపా అధిష్ఠానం కూడాఅంగీకరించినట్లు తెలుస్తోంది.
మాగుంట శ్రీనివాసులురెడ్డి...
ప్రకాశం జిల్లాకు చెందిన కీలక నేత, తెదేపా ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి వైకాపా తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఆయన వైకాపా కండువా కప్పుకుంటే ఒంగోలు ఎంపీ టికెట్ ఇచ్చేందుకు ఆ పార్టీ అధినేత జగన్ సుముఖుత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఒంగోలు నుంచి పోటీచేసి గెలిచిన జగన్ బాబాయ్, వైకాపా మాజీ ఎంపీని రాజ్యసభకు లేదా ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తారని తెలుస్తోంది. బాలినేని శ్రీనివాస్‌రెడ్డితో ఉన్న విభేదాలే వైవీ సుబ్బారెడ్డికి టికెట్ ఇవ్వకపోవడానికి కారణాలని పుకార్లు వస్తున్నాయి.
తోట నరసింహం...
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఎంపీతెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. అనారోగ్య కారణాలతో తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించిన తోట నరసింహం తన భార్యకు జగ్గంపేట ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వాలని పార్టీ అధిష్ఠానాన్ని కోరారు. ఈ నేపథ్యంలోనే నరసింహం సతీమణి వాణి, కుమారుడు రామ్‌జీ, ఇతర అనుచరులతో ఆదివారం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తనకు టిక్కెట్ కేటాయించాల్సిందిగా కోరారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ.. ముందు నరసింహం ఆరోగ్యం కుదుటపడేలా చూసుకోవాలని, కోలుకున్న తర్వాత ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని హామీ ఇచ్చారు. ఈలోగా పార్టీ అభ్యర్థుల విజయానికి కృషిచేయాలని సూచించారు. దీంతో ఆమె అసంతృప్తిగానే వెనుదిరిగారు.రేపు వీరు వైకాపలో చేరనున్నట్లు తెలుస్తోంది. పెద్దాపురం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా తోట వాణి పోటీచేసే అవకాశం.