Delhi liquor scam: దిల్లీ మద్యం కుంభకోణంలో ఆసక్తి కరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా దిల్లీ మద్యం స్కామ్ రిమాండ్ రిపోర్టులో కల్వకుంట్ల కవిత పేరును ఈడీ అధికారులు చేర్చారు. అమిత్ ఆరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరును చేర్చినట్లుగా ఈడీ పేర్కొంది. మంగళవారం రాత్రి అమిత్ ఆరోరాను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. అలాగే సౌత్ గ్రూప్ సంస్థ వంద కోట్ల రూపాయల ముడుపులను చెల్లించినట్లు తేల్చారు. సౌత్గ్రూప్ను శరత్ రెడ్డి, కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి నియంత్రించేవారని ఈడీ వెల్లడించింది.
ఈ గ్రూపు ద్వారా రూ. వంద కోట్లను విజయ్నాయర్కు చేర్చినట్లు ఈడీ తమ విచారణలో బట్టబయలు చేసింది. ఈడీ చేసిన దర్యాప్తులో అమిత్ ఆరోరా వాగ్మూలంలో ఈ విషయాలను స్పష్టంగా ధృవీకరించినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. 36 మంది రూ. 1.38 కోట్లు విలువ చేసే 170 మొబైల్ ఫోన్లును ధ్వంసం చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. వీటిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదుగురి 33 ఫోన్లను మాయం చేశారన్నారు. ధ్వంసం చేసిన సెల్ఫోన్లలో రెండు కవిత నంబర్లు, పది మొబైల్ ఫోన్లు వాడినట్లు ప్రకటించారు. ఆమె వాడిన ఈ ఫోన్లు కనిపించకుండా పూర్తిగా ధ్వంసం చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
కుంభకోణంతో ప్రమేయం ఉన్న భాగస్వాములు, అనుమానితుల ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను ధ్వంసం చేశారని ఈడీ అధికారులు గుర్తించారు. సాక్ష్యాధారాలు, ముడుపుల వివరాలున్న డిజిటల్ డేటాను కూడా పూర్తిగా కనిపించకుండా చేశారని ఈడీ దర్యాప్తులో తేలింది. వీరి వద్దనుంచి కేవలం 17 ఫోన్లను మాత్రమే రికవరీ చేసినట్లు కోర్టుకు వివరించారు. ఈ స్కామ్‌లో ఎందరో మద్యం వ్యాపారులు, సీనియర్ ప్రభుత్వ అధికారులు ఉన్నారని తమ విచారణలో ఈడీ అధికారులు గుర్తించారు. ప్రధాన నిందితుల్లో దిల్లీ ఎక్సైజ్‌శాఖ మంత్రి ఒకరుగా ఉన్నారని ఈడీ ప్రకటించింది.