ఝార్ఖండ్ జంషెద్పుర్లోని టాటానగర్ రైల్వేస్టేషన్లో ఓ మహిళ అరుదైన పాములను తరలిస్తూ ఆర్పీఎఫ్ పోలీసులకు పట్టుబడింది. ఆ మహిళ నుంచి అనేక విదేశీ జాతుల పాములు, ఇతర జీవులను స్వాధీనం చేసుకున్నారు. వాటిని అటవీ శాఖకు అందిస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఆమెను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆర్పీఎఫ్ అధికారులు వెల్లడించారు.
రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఓ మహిళ తన బ్యాగులో ఝార్ఖండ్‌లోని టాటానగర్ మీదుగా దిల్లీకి విదేశీ పాములను అక్రమంగా తరలిస్తున్నట్లు రైల్వే పోలీసులకు సమాచారం అందింది. వెంటనే వారు టాటానగర్‌లో తనిఖీలు చేపట్టారు. ప్లాట్‌ఫామ్ నంబర్ 3 పై దిల్లీకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న నీలాంచల్ ఎక్స్‌ప్రెస్ జనరల్ బోగీలో ఆ మహిళను బ్యాగ్‌తో సహా గుర్తించారు. ఆమెను అరెస్ట్ చేసి.. విచారణ చేపట్టగా ఆ మహిళది పుణె అని చెప్పింది. ఒక పరిచయం ఉన్న వ్యక్తి తనకు ఈ బ్యాగ్ ఇచ్చాడని, దానిని దిల్లీకి తీసుకెళ్లాలని సూచించాడని ఆ మహిళ తెలిపింది. ఆమె నాగాలాండ్ నుంచి గువహటికి వెళ్లి అక్కడ నుంచి హిజ్లీకి, తర్వాత దిల్లీకి వెళ్తున్నట్లు వెల్లడించింది.
మహిళ నుంచి స్వాధీనం చేసుకున్న సర్పాల వివరాలు తెలుసుకునేందుకు పాములు పట్టుకునే వ్యక్తికి పిలిపించారు. అటవీశాఖకు సమాచారం అందించారు. ఆ బ్యాగులో 28 రకాల పాములే కాకుండా సాలీడ్లు, నల్లని పురుగులు, బల్లులు ఉన్నాయి. అందులో సాండ్ బోవా అనే పాము ధర అంతర్జాతీయ మార్కెట్లో కొన్ని కోట్లలో ఉంటుంది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు అటవీశాఖ అధికారుల ఆధ్వర్యంలో జరుగుతోందని.. దీనితో సంబంధం ఉన్న వారిపై తగిన చర్యలు తీసుకుంటామని ఆర్పీఎఫ్ పోస్ట్ ఇన్ఛార్జ్ సంజయ్ తివారీ తెలిపారు.