బాధిత రైతు కుటుంబాలను పరామర్శించిన రాహుల్, ప్రియాంక..
కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా నిర్బంధాల మధ్య ఎట్టకేలకు యూపీలోని లఖింపుర్ ఖేరి చేరుకున్నారు. లఖింపుర్ ఖేరి హింసాత్మక ఘటనలో ప్రాణాలు కోల్పోయిన రైతు కుటుంబాలను పరామర్శించారు. తొలుత 19 ఏళ్ల లవ్‌ప్రీత్ సింగ్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారిని ఓదార్చారు.
లఖింపుర్ ఖేరికి రాహుల్ వెళ్లకుండా ఈ రోజు ఉదయం లఖ్‌నవూ విమానాశ్రయం వద్ద ఆయన్ను యూపీ పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చివరకు పోలీసులు వెనక్కి తగ్గి ఐదుగురికి మాత్రమే అవకాశం కల్పించడంతో లఖ్‌నవూ నుంచి మధ్యాహ్నం బయల్దేరిన రాహుల్ గాంధీ.. తొలుత సీతాపూర్ చేరుకున్నారు. అక్కడ గెస్ట్ హౌస్‌లో నిర్బంధంలో ఉన్న తన సోదరి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వద్దకు చేరుకున్నారు. రాహుల్ కాన్వాయ్‌ని పోలీసులు అడ్డుకోవడంతో సీతాపూర్ హైవేపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది.
కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం ఆమెను అధికారులు నిర్బంధం నుంచి విడుదల చేయడంతో ఇద్దరూ కలిసి కొద్దిసేపటి క్రితమే లఖింపుర్ ఖేరికి చేరుకున్నారు. వీరి వెంట పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్‌తో పాటు కాంగ్రెస్ నేతలు రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా, కేసీ వేణుగోపాల్, దీపీందర్ సింగ్ హుడా ఉన్నారు.
వెయ్యి వాహనాలతో..
గురువారం వెయ్యి వాహనాలతో లఖింపుర్‌కు వెళ్తామని ఉత్తరాఖండ్ కాంగ్రెస్ చీఫ్ హరిష్ రావత్ తెలిపారు.