AP government owes Rs.1,910 crore: అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు తయారైంది ఏపీ దుస్థితి. ఏపీలో రైల్వేల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకం మూలంగా ఆటంకం ఏర్పడుతోంది. ఏపీలో డబ్లింగ్ ప్రాజెక్టుల అమలుకు కేంద్రం నిధులిస్తానన్నా, చేసిన పనులకు తన వాటా చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వ దివాళాకోరు తీరుతో రైల్వేల అభివృద్ధి మందగిస్తోంది. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారంపై కేంద్ర మంత్రుల ప్రకటనతో పార్లమెంటు సాక్షిగా ఏపీ పరువు మంట కలుస్తోంది. విజయవాడ-గుడివాడ-భీమవరం-నరసాపురం, గుడివాడ-మచిలీపట్నం, భీమవరం-నిడదవోలు మధ్య చేపడుతున్న 221 కిలోమీటర్ల డబ్లింగ్ ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం తన వాటా కింద ఇంకా రూ.1,910 కోట్లు చెల్లించాల్సి ఉందని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. భీమవరం-నరసాపురం లైన్ విస్తరణ గురించి ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు బుధవారం లోక్‌సభలో అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ఈ 221 కిలోమీటర్ల మార్గంలో భీమవరం-నరసాపురం డబ్లింగ్ పనులు పూర్తయినట్లు చెప్పారు. రూ.4,687.55 కోట్ల ఈ ప్రాజెక్టును రైల్వే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు 50% వ్యయపంపిణీ విధానంలో చేపట్టాయని, 2023 జనవరి వరకు ఇందుకోసం రూ.4,398.94 కోట్లు ఖర్చయ్యాయని వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంతవరకూ రూ.289.63 కోట్లు చెల్లించిందని, ఇంకా రూ.1,910 కోట్లు చెల్లించాల్సి ఉందని వెల్లడించారు. భీమవరం-నరసాపురం ప్రాజెక్టు కోసం 2022-23లో రూ.300 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు డబ్లింగ్, విద్యుదీకరణ పనులన్నీ గత ఏడాది సెప్టెంబరు నాటికి పూర్తయినట్లు వెల్లడించారు.
ఏపీలో మూడు రైల్వేస్టేషన్ల అభివృద్ధి: ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, తిరుపతి, నెల్లూరు రైల్వేస్టేషన్లను పునర్‌అభివృద్ధి చేయబోతున్నట్లు రైల్వేమంత్రి తెలిపారు. ఎంపీలు లావుశ్రీకృష్ణదేవరాయలు, వల్లభనేని బాలశౌరి అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ఈ మూడు స్టేషన్ల అభివృద్ధికి సంబంధించిన సాంకేతిక, ఆర్థిక అధ్యయనం చేపట్టి, డీపీఆర్‌లు తయారుచేసినట్లు వెల్లడించారు. ఈపీసీ విధానంలో వీటి అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు.
ఏపీలో 72 అమృత్‌భారత్ స్టేషన్లు: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన అమృత్‌భారత్ స్టేషన్ల పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లో 72 రైల్వే స్టేషన్లను అభివృద్ధిచేయనున్నట్లు మంత్రి అశ్వినీవైష్ణవ్ తెలిపారు. ఆయన బుధవారం రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఇందులో ఆదోని, అనకాపల్లి, అనంతపురం, అనపర్తి, అరకు, బాపట్ల, భీమవరం టౌన్, బొబ్బిలి, చీపురుపల్లి, చీరాల, చిత్తూరు, కంభం, ధర్మవరం, డోన్, దొనకొండ, దువ్వాడ, ఎలమంచిలి, ఏలూరు, గిద్దలూరు, గుత్తి, గుడివాడ, గూడూరు, గుణదల, గుంటూరు, హిందూపురం, ఇచ్ఛాపురం, కడప, కదిరి, కాకినాడటౌన్, కొత్తవలస, కుప్పం, కర్నూలు సిటీ, మాచర్ల, మచిలీపట్నం, మదనపల్లి రోడ్డు, మంగళగిరి, మార్కాపురం రోడ్డు, మంత్రాలయం రోడ్డు, నడికుడి జంక్షన్, నంద్యాల, నరసరావుపేట, నరసాపురం, నౌపాడ జంక్షన్, నెల్లూరు, నిడదవోలు, ఒంగోలు, పాకాల, పలాస, పార్వతీపురం, పిడుగురాళ్ల, పీలేరు, రాజంపేట, రాజమహేంద్రవరం, రాయనపాడు, రేణిగుంట, రేపల్లె, సామర్లకోట, సత్తెనపల్లి, సింహాచలం, సింగరాయకొండ, శ్రీకాళహస్తి, శ్రీకాకుళం రోడ్డు, సూళ్లూరుపేట, తాడేపల్లిగూడెం, తాడిపత్రి, తెనాలి, తిరుపతి, తుని, విజయవాడ, వినుకొండ, విశాఖపట్నం, విజయనగరం జంక్షన్‌లు ఉన్నట్లు వెల్లడించారు. ఇక్కడ ప్రయాణికులకు సౌకర్యాలు పెంచనున్నట్లు తెలిపారు. వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ పథకాన్ని కూడా ఇక్కడ అమలుచేస్తామన్నారు. ఈ స్టేషన్లను ఇరువైపులా ఆయానగరాలతో అనుసంధానించనున్నట్లు చెప్పారు.
ఇవీ చదవండి