Snake Catcher Died: కర్ణాటకలో విషాద ఘటన జరిగింది. నాగుపామును సంరక్షించే క్రమంలో కాటుకు గురైన ఓ వ్యక్తి.. చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో అతడి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
అసలేం జరిగిందంటే.. నెలమంగళలోని మారుతీనగర్‌కు చెందిన లోకేశ్.. చుట్టుపక్క ప్రాంతాల ప్రజలు ఫోన్ చేస్తే పాములను సంరక్షించడానికి వెళ్లేవాడు. అందుకే అందరూ అతడిని స్నేక్ లోకేశ్ అని పిలుస్తుంటారు. అయితే ఆగస్టు 17న డాబస్ పట్టణం నుంచి లోకేశ్‌కు కాల్ వచ్చింది. వెంటనే వెళ్లిన అతడు అక్కడ బుసలు కొడుతున్న ఓ నాగుపామును పట్టుకునేందుకు ప్రయత్నించాడు. కానీ అదే సమయంలో ఆ సర్పం.. లోకేశ్ కుడి చేతి వేలిపై కాటు వేసింది.
వెంటనే స్థానికులు అతడిని నెలమంగళ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి అత్యవసర చికిత్స నిమిత్తం బెంగళూరు మణిపాల్ హాస్పిటల్‌కు తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న లోకేశ్.. మంగళవారం మరణించాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నెలమంగళలో చిన్న హోటల్ నడుపుకుని జీవనం కొనసాగిస్తున్నాడు. కొన్ని సీరియల్స్‌లో కూడా నటించాడు. పర్యావరణ, వన్యప్రాణుల ప్రేమికుడైన లోకేశ్ ఇప్పటివరకు సుమారు 35,000 పాములను పట్టుకుని అడవిలో విడిచిపెట్టాడు. పాములు పట్టుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండటం చాలా అవసరమని వైద్యులు సూచిస్తున్నారు.
ఇవీ చదవండి: ప్రభుత్వం సకాలంలో నిర్ణయాలు తీసుకోవట్లేదని గడ్కరీ విమర్శలు