భారత పారిశ్రామికవేత్త, అపర కుబేరుడు ముకేశ్ అంబానీ, ఆయన కుటుంబ భద్రతపై కీలక ఆదేశాలు జారీ చేసింది సుప్రీం కోర్టు. వారి భద్రతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై త్రిపుర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. మే 31, జూన్ 21న హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేసిన కేంద్రం పిటిషన్పై జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జేబీ పర్దివాలాతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరు పక్షాలకు నోటీసులు జారీ చేసింది.
" జూలై 21న విచారించేందుకు రిటర్నబుల్ నోటీసులు ఇస్తున్నాం. మరోవైపు.. మే 31, జూన్ 21న ఇచ్చిన ఆదేశాల అమలుపై స్టే విధిస్తున్నాం. "
- సుప్రీం ధర్మాసనం.
విచారణలో భాగంగా కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ముంబయిలో వ్యక్తులకు కల్పించే భద్రతపై త్రిపుర ఏం చేయలేదు కనుక.. హైకోర్టులో తదుపరి విచారణపైనా స్టే విధించాలని కోరారు. హైకోర్టులో తదుపరి విచారణపై స్టే విధించకుంటే.. మరోమారు సుప్రీం తలుపుతట్టాల్సి వస్తుందన్నారు. మెహతాకు సమాధానంగా 'హైకోర్టు ఆదేశాలపై మేం స్టే ఇచ్చాక కూడా మీరు ఇక్కడకు రావాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారా? ఒకవేళ అవసరం ఏర్పడితే మేము ఇక్కడే ఉంటాము.' అని ధర్మాసనం పేర్కొంది.
ఇదీ కేసు: అంబానీ కుటుంబానికి కల్పించిన భద్రతను సవాల్ చేస్తూ.. బికేశ్ సాహా అనే వ్యక్తి త్రిపుర హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. విచారణ చేపట్టిన త్రిపుర హైకోర్టు రెండుసార్లు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అంబానీ, ఆయన భార్య, పిల్లలకు పొంచి ఉన్న ముప్పు, అంచనా నివేదికపై కేంద్ర హోంశాఖ వద్ద ఉన్న ఒరిజినల్ పత్రాలను సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది.
ఇదీ చూడండి: అంబానీ సంచలన నిర్ణయం.. ఆ పదవికి రాజీనామా.. కొత్త ఛైర్మన్ ఎవరంటే...
రిలయన్స్ @100 బిలియన్ డాలర్లు.. ఏకైక దేశీయ కంపెనీగా అరుదైన రికార్డ్